తెలుగు రాష్ట్రాలతో సహా 13 హైకోర్టు లకు కొత్త సీజేలు 

దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబరు 16న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలిజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పికె మిశ్రా, తెలంగాణ హైకోర్టు సిజెగా సతీష్‌చంద్ర మిశ్రా నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. దేశవ్యాప్తంగా 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను (సీజేలు) పదవోన్నతిపై నియమించగా,  మరో 5 గురు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేశారు.  ప్రస్తుతం తాత్కాలిక సీజేలుగా పనిచేస్తున్న వారిని, హైకోర్టు జడ్జీలుగా పనిచేస్తున్న వారిని పదవోన్నతిపై ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు.
 
పదవోన్నతిపై తెలంగాణకు జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్‌ కుక్జ స్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, అలహాబాద్‌ కు జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌, కలకత్తాకు జస్టిస్‌ ప్రకాష్‌ శ్రీవాస్తవ, కర్ణాటకకు జస్టిస్‌ రీతురాజ్‌ అవస్థీ, మేఘాలయకు జస్టిస్‌ రంజిత్‌ వీ మోర్‌, గుజరాత్‌ కు జస్టిస్‌ అరవింద్‌కుమార్‌, మధ్యప్రదేశ్‌ కు  జస్టిస్‌ ఆర్‌ వీ మలిమత్‌ లను నియమించారు.
 
జస్టిస్‌ ఏకే గోస్వామి (ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు), జస్టిస్‌ బిశ్వంత్‌ సొమద్దర్‌ (మేఘాలయ నుంచి సిక్కింకు), జస్టిస్‌ మహమ్మద్‌ రఫీక్‌ (మధ్యప్రదేశ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌కు), జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి (రాజస్థాన్‌ నుంచి త్రిపురకు), జస్టిస్‌ ఏఏ ఖురేషి (త్రిపుర నుంచి రాజస్థాన్‌కు)లను బదిలీ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా1964 ఆగస్టు 29న చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్‌ యూనివర్సిటీ బిఎస్‌సి, ఎల్‌ఎల్‌బి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకొని రారుగఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని చత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో పేరుగాంచారు. 
 
చత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేశారు. అనంతరం 2007 సెప్టెంబరు 1 వరకూ అడ్వకేట్‌ జనరల్‌గా కొనసాగారు. 2009 డిసెంబరు 10న చత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
 
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ తండ్రి బిఎన్‌ శర్మ వ్యవసాయవేత్తగా ప్రసిద్ధి చెందడంతోపాటు జబల్పూర్‌ యూనివర్సిటీ ఉపకులపతిగా పనిచేశారు. తల్లి శాంతి శర్మ జబల్పూర్‌ విద్యాశాఖాధికారిగా పనిచేశారు. 
 
జస్టిస్‌ సతీష్‌ చంద్ర ప్రాథమిక విద్యాభ్యాసం క్త్రెస్ట్‌చర్చ్‌ బార్సు హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లోనూ జబల్‌పూర్‌ సెంట్రల్‌ స్కూల్‌లో 12 వరకూ చదివారు. 1981లో డాక్టర్‌ హరి సింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ నుంచి బిఎస్‌సి పట్టా అందుకున్నారు. అదే యూనివర్సిటీలో న్యాయ పట్టా అందుకొని 1984 సెప్టెంబరు 1న మధ్యప్రదేశ్‌ బార్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. 
 
రాజ్యాంగం, సేవలు, సివిల్‌, క్రిమినల్‌ విషయాల్లో ప్రాక్టీస్‌ 1993 మే 29లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2004 జూన్‌ 28న భారత ప్రభుత్వం సీనియర్‌ ప్యానెల్‌ కౌన్సెల్‌గా నియమితులయ్యారు.