జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు సైనికుల వీరమరణం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లోని పిర్‌పంజాల్ శ్రేణుల్లో ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. 

దీంతో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ తోపాటు మరో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పూంచ్‌ జిల్లాలోని నియంత్రణా రేఖ వెంబడి ఉన్న సురాన్‌ కోట్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ తెలిపారు.

ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.గాలింపు చర్యలు జరుపుతున్న ఆర్మీ అధికారులపైకి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. 

ఈ ఘటనలో జేసీఓతో పాటు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా “తీవ్రంగా గాయపడిన జేఓవీ, నలుగురు జవాన్లను సమీప ఆస్పత్రికి తరలించాము. చికిత్స అందిస్తుండగా వారు మరణించారు. సర్చ్‌ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది” అని ఆర్మీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఐదుగురు భారత సైనికుల వీరమరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆఫ్ఘనిస్థాన్ తర్వాత కశ్మీర్‌లో పాక్‌ప్రేరిత తాలిబన్ల ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు  ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వాపోయారు. కశ్మీర్‌లో భయాలన్నీ నిజమౌతున్నాయని తెలిపారు.