రెచ్చిపోయిన శివ‌సేన .. ఆటో డ్రైవ‌ర్ల‌పై క‌ర్ర‌ల‌తో దాడి

లఖింపూర్‌ ఖీరీ హింసాత్మక ఘటనలను నిరసిస్తూ మహారాష్ట్రలోని అధికార పక్షం ‘మహావికాస్‌ అఘాదీ’ (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌) నేతృత్వంలో సోమవారం జరిపిన బంద్ సందర్భంగా శివ‌సేన కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు.

థానేలో రోడ్ల‌పైకి వ‌చ్చిన ఆటో డ్రైవ‌ర్ల‌పై శివ‌సేన కార్య‌క‌ర్త‌లు క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. ఓ లీడ‌రైతే ఏకంగా ఆటో డ్రైవ‌ర్ చెంప ఛెల్లుమ‌నిపించాడు. ఆటోల‌ను ఆపాల‌ని కొంద‌రు అరిచారు. శివ‌సేన కార్య‌క‌ర్త‌ల దాడుల‌తో ఆటో డ్రైవ‌ర్లు భ‌య‌ప‌డ్డారు. ఇక బంద్ నేప‌థ్యంలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా శివసేన కార్యకర్తల దౌర్జన్య చర్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కొన్ని ఆటోలలో ప్రయాణిస్తున్న సాధారణ ప్రజలు ఈ పరిస్థితులతో భయకంపితులయ్యారు.

సిటీ బస్సు లపై కూడా కొన్నిచోట్ల రాళ్లు విసరడంతో ఆగిపోయాయి. సాయంత్రం 4 గంటలకు బంద్ పూర్తయ్యాక తిరిగి నడవడం ప్రారంభించాయి. బలవంతంగా షాపులను మూసివేస్తుండడం పట్ల వర్తక సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేసినా, బంద్ కు సహకరించాయి. తెరిచిఉండే షాప్ లపై అధికార కూటమి కార్యకర్తలు దౌర్జన్యం చేస్తే సహింపబోమని బిజెపి హెచ్చరించింది.

థానే, ముకుంద్, వీక్రోలి  రైల్వే స్టేషన్ వద్ద నిరసనకారులు గుమికూడి, రైళ్లను ఆపే ప్రయత్నం చేసినా, రైల్వే స్టేషన్లోకి ప్రవేశింపవద్దని అధికారులు హెచ్చరించడంతో వెనుకకు వెళ్లిన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

కాగా, మహారాష్ట్రలో సోమవారం నాటి బంద్‌పై కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలో తొలిసారని ఆ రాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. శాంతి భద్రతలను నిర్వహించే బాధ్యత కలిగిన వారు బంద్ కోసం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు.

 సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు గతంలో ఇలాంటి బంద్‌లను నిషేధించాయని, శివసేనకు జరిమానా కూడా విధించాయని ఆయన గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రైతులకు సంఘీభావంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా పిలుపు ఇచ్చిన బంద్‌ను బాంబే హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని తాము కోరుతున్నామని చెప్పారు.