కాశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు టీచర్ల మృతి 

జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్‌లో సంగం ఈద్గా ప్రాంతంలో గురువారం ఉదయం ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కశ్మీరులో మైనారిటీ మతాలవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. 

జమ్మూ-కశ్మీరు పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, గురువారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో శ్రీనగర్‌లోని సంగం ఈద్గా ఏరియాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి  ఉగ్రవాదులు చొరబడి, కాల్పులు జరిపారని చెప్పారు. ఈ కాల్పుల్లో ప్రిన్సిపాల్ సుపుందర్ కౌర్, టీచర్ దీపక్ చంద్ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 

సంఘటన స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఉగ్రవాదుల కోసం గాలింపు జరుగుతోందని చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఈ పాఠశాలలో విద్యార్థులు లేరని, తరగతులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని తెలిపారు. శ్రీనగర్, బందిపొరలలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ప్రముఖ ఫార్మసిస్ట్ మఖన్ లాల్ బింద్రూ కూడా ఉన్నారు. శ్రీనగర్ మేయర్ మాట్లాడుతూ, ఓ రోడ్డుకు బింద్రూ పేరు పెడతామని చెప్పారు. 

దీపక్ చంద్ ఓ హిందూ అని, సుపుందర్ కౌర్ ఓ సిక్కు అని ఆ పాఠశాలలోని ఓ టీచర్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.  ఉగ్రవాదులు ఈ పాఠశాలలోకి చొరబడి, అక్కడ ఉన్నవారి ఐడెంటిటీ కార్డులను అడిగారని, మైనారిటీలైన హిందూ, సిక్కు మతాలకు చెందినవారిని దారుణంగా కాల్చి చంపారని చెప్పారు.

 సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ఆగ్రహం 

జమ్మూ-కశ్మీరులో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తుండటంపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీమాంతర ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇక్కడ జరుగుతున్న సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ  శాఖ తెలిపింది.

మొత్తం మీద కశ్మీరు లోయలో గడచిన ఐదు రోజుల్లో ఏడుగురు సాధారణ ప్రజలు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఏడుగురిలో నలుగురు హిందూ, సిక్కు వంటి మైనారిటీ మతాలకు చెందినవారు. భాగస్వాములందరితో జరిగే ప్రతి సమావేశంలోనూ ఈ విషయాన్ని లేవనెత్తుతామని భారత్ వెల్లడించింది. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించేవిధంగా కృషి చేస్తామని తెలిపింది.

పాక్‌ సరిహద్దులో ఆయుధాల స్వాధీనం

మరోవంక,  పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్‌ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసేందుకు ఉగ్రవాదులు చేసిన కుట్రను బీఎస్‌ఎఫ్‌ భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ఎస్‌పీఎస్‌ సంధు తెలిపారు. బీఎస్‌ఎఫ్‌ దళాలు స్వాధీనం చేసుకున్న వాటిలో నాలుగు పిస్టల్స్‌, ఎనిమిది పిస్టల్‌ మ్యాగజైన్స్‌, 232 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నదని చెప్పారు.

గత ఆరు నెలలుగా డ్రోన్‌ల ద్వారా సరిహద్దులోని ఈ వైపునకు ఆయుధాలను జారవిడిచేందుకు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు ప్రయత్నాలు జరిగాయి. గత శనివారం ఫలైన్‌ మండల్‌లోని సౌంజనా గ్రామంలోని అంతర్జాతీయ సరిహద్దులోనూ డ్రోన్‌ సహాయం జారవిడిచిన ఏకే అస్సాల్ట్‌ రైఫిల్‌, మూడు మ్యాగజైన్లు, 30 రైండ్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. 

గత నెల 27న సైతం బీఎస్‌ఎఫ్‌ నాలుగు పిస్టల్స్‌, ఎనిమిది మ్యాగజైన్లు, వంద రౌండ్లు, కిలో డ్రగ్స్‌తో పాటు రూ.2.75లక్షలు నకిలీ భారత కరెన్సీని అఖ్నూర్‌ సెక్టార్‌లోని ఐబీ సరిహద్దు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.