డ్రగ్స్ కేసులో తాలిబన్లు …. ఎన్‌ఐకే కు బదిలీతో జగన్ లో కలవరం!!

గుజరాత్‌ ముంద్రా పోర్టులో గత నెల 13న పట్టుబడిన రూ.21వేలకోట్ల విలువైన 2,988 కిలోల మాదక ద్రవ్యాలు కేసులో ఒకవంక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు గల సంబంధాల గురించి పలు ఊహాగానాలు వెలువడుతుండగా, ఈ కేసును ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తుండే  ఎన్‌ఐఏకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బదిలీ చేయడం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శిబిరంలో కలకలం రేపుతున్నది. 

నార్కోటిక్స్‌ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్లు భావించడంతోనే కేంద్రం ఈ  కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతున్నది. ఆఫ్ఘన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు ‘సెమీ ప్రాసెస్డ్‌ టాల్క్‌ స్టోన్‌’గా రవాణా కావడంతో అక్కడి తాలిబన్ ప్రభుత్వ నేతలతో సంబంధం లేకుండా ఇక్కడకు వచ్చే అవకాశం లేదని కూడా స్పష్టం అవుతున్నది.

రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) సెప్టెంబర్‌ కచ్‌ జిల్లాలోని ముంద్రా పోర్టులో రెండు కంటైనర్ల నుంచి 2,98821 కిలోల హెరాయిన్‌ను ఢిల్లీకి తరలించేందుకు యత్నిస్తుండగా స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఐదుగురు విదేశీ పౌరులతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

పట్టుకున్న డ్రగ్స్‌ చిరునామా ఏపీలోని విజయవాడ ఆషీ ట్రేడింగ్‌ పేరిట ఉండడంతో మొత్తం దర్యాప్తు వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ వైపే తిరుగుతున్నాయి. అయితే కేవలం చిరునామా మాత్రమే విజయవాడదని, ఏపీకి సంబంధం లేదంటూ లోతుగా దర్యాప్తు చేయకుండానే తరచూ డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రకటనలు చేస్తుండడంతో ఆయన ప్రభుత్వంలోని కొందరు పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కూడా వచ్చాయి.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా భావించే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి ఇందులో ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు విచారణ సంస్థల దర్యాప్తులో వెల్లడైన్నట్లు చెబుతున్నారు. గతేడాది సైతం దాదాపు 25వేల టన్నుల హెరాయిన్‌ ఆఫ్ఘన్‌ నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఢిల్లీ సహా దేశంలోని పలు ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఈ సందర్భంగా గుర్తించారు.

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏపీలో మాదక ద్రవ్యాల పంపిణి పెద్ద ఎత్తున పెరిగిన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే మొత్తం వ్యవహారం ఏపీ నుండి నడిపితే గుజరాత్ లోని పోర్ట్ ను ఎందుకు ఎన్నుకున్నారు? సమీపంలోని కాకినాడ, చెన్నై పోర్ట్ లను ఎంచుకోలేదే ? అన్న కోణం నుండి కూడా దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తున్నది.

ఇక్కడ నిఘా ఎక్కువగా ఉంటూఉండడంతో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రికి సన్నిహితంగా వ్యవహరిస్తున్న పారిశ్రామిక వేత్త ఆదానీకి చెందిన ముంద్రా పోర్ట్ ను ఎంచుకున్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ డ్రగ్ దిగుమతికి ఉపయోగించిన విజయవాడ చిరునామాకు చెందిన సుధాకర్ దంపతులు ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు. సుధాకర్ గతంలో కాకినాడలో ఇందులో ప్రధాన సూత్రధారి చెందిన కంపెనీలో పనిచేశాడని, ప్రస్తుతం చెన్నైలో ముఖ్యమంత్రి సమీప బంధువు వద్దనే పనిచేస్తున్నాడని  కూడా తెలుస్తున్నది.

 ఇలా ఉండగా, తాలిబన్లతో వైసీపీ నేతలు సంబంధాలు పెట్టుకొని డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారని, వాటిని అన్నింటినీ బయట పెడతామని ప్రతిపక్ష నాయకుడు ఎన్ చంద్రబాబునాయుడు ఆరోపించడం ఈ సందర్భంగా సంచలనం కలిగిస్తున్నది. తాలిబన్లతో నేరుగా అధికార పక్షానికి చెందిన ప్రముఖులే సంబంధాలు పెట్టుకున్నారా? అనే కోణం నుండి ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. 

ముద్రా పోర్ట్ లో హెరాయిన్ పట్టుబట్టడానికి ముందే జగన్ కు సన్నిహితుడైన ఒక మంత్రి ఒక ప్రత్యేక విమానంలో విదేశీ పర్యటన జరిపినట్లు ఈ సందర్భంగా వెలుగులోకి వస్తున్నది. ఐదారు రోజులు దేశంలో లేరని, అయితే ఎక్కడకు వెళ్లారో మాత్రం చెప్పలేదని అంటున్నారు. ఆయన నేరుగా రష్యా వెళ్లి, అక్కడ తాలిబన్ ప్రతినిధులతో బేరం కుదుర్చుకు వచ్చారా అనే అనుమానాలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు కలుగుతున్నాయి. 

“గోరంతలున్న దానిని కొండంతలు చేస్తున్నారు” అంటూ డ్రగ్స్ కేసుపై అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగుతున్న పరస్పర ఆరోపణలను కొట్టివేస్తూ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ఐఏ దర్యాప్తులో ఏపీ ప్రభుత్వంలోని పెద్దలకు దేశంలోని మాదక ద్రవ్యాల మాఫియాతో గల సంబంధాలు, రాష్ట్రంలోని ప్రధాన పోర్ట్ లలో కుటుంభం సభ్యులకు వాటాలు పొందిన ఒక పార్టీ ప్రముఖుని పాత్ర కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.