యుపిలో ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసిన తికాయత్‌

మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న ఉత్తర ప్రదేశ్ లో గత ఆదివారం రైతుల నిరసన హింసాయుత్మకంగా మారడం, నలుగురు రైతులతో సహా తొమ్మిదిమంది మృతి చెందడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి మంచి అవకాశం దొరికిందని  ప్రతిపక్షాలు అన్ని భావించాయి. 
 
యుపిలో రాజకీయ మనుగడకోసం తంటాలు పడుతున్న కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ, కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించాలనుకొంటున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటి వారంతా బాధితులకు సానుభూతి చూపే పేరుతో అక్కడకు బయలుదేరారు. పొరుగు రాష్టాల కాంగ్రస్ ముఖ్యమంత్రులు కూడా బయలుదేరారు. 
 
వారంతా అక్కడకు చేరిఉంటే మొత్తం రాజకీయ వివాదంగా మారి, పరిష్కారం కనుగోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యెడిది కాదు. 
అయితే  ఊహించని రీతిలో 24 గంటల లోగానే ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకోవడం, మృతి చెందిన రైతు కుటుంబాలకు చేరుకోవడం, తమ నిరసనను ఆపివేస్తున్నామని రైతు నేతలే ప్రకటించడం వారోతోపాటు మొత్తం దేశాన్ని విస్మయానికి గురిచేసింది. 
 
ఇంతకు ముందు ఢిల్లీలో, హర్యానా సరిహద్దులో, ఇతరత్రా రైతు ఉద్యమం హింసాత్మకంగా మారిన సందర్భంగా ప్రశాంతత తీసుకు రావడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా సమయం పట్టింది. ప్రతిపక్ష నేతలు ఎవ్వరిని లఖింపుర్ ఖేరికి వెళ్లకుండా కట్టడి చేయడం ద్వారా వారు రాజకీయ లబ్ది పొందే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది. 
 
వాస్తవానికి వారెవ్వరిని అక్కడకు రాకుండా చూడమని ప్రభుత్వానికి  సలహా ఇచ్చింది స్వయంగా ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర వహించిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆర్గనైజేషన్‌ అధినేత రాకేశ్‌ తికాయత్‌ కావడం గమనార్హం. సంఘటన జరగగానే యుపి ఉన్నతాధికారులు ఆయనను సంప్రదించి, అక్కడకు వచ్చి పరిస్థితులను సర్దుబాటు చేయడానికి సహకరింపమని కోరారు.
ఆయన వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 1.30 గంటలకల్లా చేరుకున్నారు. వివిధ స్థాయిలలో ప్రభుత్వ అధికారులతో సమాలోచనలు జరిపి మధ్యాన్నం 2 గంటకల్లా, అంటే సుమారు 12 గంటలలో నిరసన విరమిస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ యుపిలో దశాబ్దాలుగా అనుబంధం గల సీనియర్ ప్రభుత్వ అధికారులు సహితం ఈ విషయంలో కీలక పాత్ర వహించారు.
ఈ ప్రాంతంలోనే యుపిలో రైతు ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నది. ఆ ఉద్యమంకు కీలక  నేత  తికాయత్‌. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమాన్ని కీలక దశకు తీసుకెళ్లిన మహేంద్రసింగ్  తికాయత్‌ కుమారుడు ఆయన. చర్చల సందర్భంగా గాని, ఆ తర్వాత గాని ఆయన యోగి ప్రభుత్వంపై ఎటువంటి ప్రతికూల విమర్శలు చేయకపోవడం గమనార్హం. నిరసన జరుపుతున్న రైతులందరూ వెళ్ళిపోయిన తర్వాతనే ఆయన అక్కడి నుండి వెళ్లారు. 
అధికార వర్గాల కధనం ప్రకారం సంఘటన జరిగిన ప్రదేశంకు దగ్గరగా ఉన్న ఒక భవనంలో రైతు నాయకులకు, అధికారులకు మధ్య “మూడు దశల్లో” చర్చలు జరిగాయి.  ముందుగా, లఖింపూర్ ఖేరీ జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ చౌరసియా, పోలీసు సూపరింటెండెంట్ విజయ్ ధుల్ రైతు ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు,
 
రైతు బృందానికి  తికాయత్‌ నాయకత్వం వహించగా, ఆయనతో పాటు ఆయనకు నమ్మకస్తులైన మరో ఇద్దరు నేతలు, నలుగురు స్థానిక సిఖ్ రైతులు ఉన్నారు. రెండో దశలో,  వ్యూహం ప్రకారం, లక్నో రేంజ్ ఐజి లక్ష్మీ సింగ్,  డివిజనల్ కమీషనర్ రంజన్ కుమార్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా  తికాయత్‌ బృందం ప్రధానంగా మూడు డిమాండ్లు ఉంచింది:
 
1.  కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, రైతులపై కారు నడుపుతూ మరణాలకు కారకుడిగా భావిస్తున్న ఆయన  కుమారుడు ఆశిష్‌పై హత్య కేసు నమోదు. 2. వెంటనే ఎఫ్ఐఆర్ కాపీని అందించడం. 3. మరణించిన ప్రతి రైతు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, వారి కుటుంబంలోని ఒక సభ్యుడికి వారి సొంత జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం.

పరిహారం మొత్తం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదల వదులుకోవాలని నచ్చచెప్పే ప్రయత్నం అధికారులు చేశారు. వెంటనే కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. అయినా చాలాసేపటి వరకు రైతుల నుండి సానుకూల స్పందన లేకపోవడంతో చుట్టూ గుమికూడిన వేలాదిమంది రైతులలో ఎటువంటి స్వల్ప సంఘటన జరిగినా మొత్తం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి అదుపు తప్పవచ్చని అధికారులు ఆందోళన చెందారు.

నిరసనకారులలో చాలా మంది ఖడ్గాలు, కర్రలు, లైసెన్స్ గల  తుపాకులతో సాయుధులై ఉన్నారు. మరోవంక భారీ ఎత్తున అక్కడ పోలీసులు, ఆర్ పి ఎఫ్, ఎస్ ఎస్ బి దళాలను మోహరింప చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో, వ్యవసాయ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, దేవేష్ చతుర్వేది, శాంతిభద్రతల అదనపు డిజి ప్రశాంత్ కుమార్, లక్నో జోన్ ఏడీజీ ఎస్ ఎన్ సబాత్ అక్కడకు చేరుకున్నారు. ఆశిష్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతిని వారు తీసుకు వచ్చారు. 

 
చివరగా ఒప్పందం కుదుర్చుకోవడానికి జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మరణించిన రైతుల కుటుంభం సభ్యులు కూడా ఉన్నారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం మొత్తాన్ని రూ. 45 లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షలు స్నేహపూర్వకంగా ఖరారు చేశారు. చర్చల సమయంలో లక్నోలోని అత్యున్నత ప్రభుత్వ అధికారులతో పాటు, పంజాబ్ నుండి ఒక ప్రముఖ సిఖ్ నేత  తికాయత్‌ తో మాట్లాడుతూ పరిష్కారంకోసం కృషి చేశారు. 
 
ఒప్పందం కుదిరిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు పట్ల సీనియర్ అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ తికాయత్‌ పట్టుబట్టి, వారి ముందే రైతులు ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ప్రతిపక్ష నేతలు అందరిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పరిష్కారం కుదరడంతో తుది చర్చలలో భాగమైన చతుర్వేది,  అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) అవనీష్ కుమార్ అవస్థీ కీలక పాత్ర పోషించారు. 
గత ఏడాది మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు ప్రారంభించిన సమయం నుండే అవస్థీ  తికాయత్‌ తో తరచూ మాట్లాడుతూ యుపిలో వారి ఉద్యమం దారితప్పనీయకుండా చూస్తూ వచ్చారు. గతంలో జిల్లా మేజిస్ట్రేట్ గా ఉన్న సమయంలో ఆయన తండ్రితో మంచి పరిచయం ఉండడమే కాకుండా, వారి కుటుంబంతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అందుకనే లక్నో పరిసరాలలో చెప్పుకోదగిన రైతుల నిరసనలు జరగలేదని భావిస్తున్నారు.
 
అదనపు డీజీ ప్రశాంత్ కుమార్ మీరట్ జోన్ ఏడీజీగా సుదీర్ఘకాలం పనిచేశారు. చతుర్వేది తన అధికారహోదాలో గతంలో పలు సమావేశాలలో తికాయత్‌ తో కలసి పాల్గొన్నారు. అదనపు డిజి సబాత్ ఇంతకుముందు ముజఫర్‌నగర్ ఎస్ ఎస్ పి గా పనిచేశారు. పశ్చిమ యుపిలో కూడా పనిచేశారు. అందుకనే వీరంతా తికాయత్‌ ను ప్రభావితం చేయగలిగారు.