రూ 4,445 కోట్లతో 7 పీఎం మిత్ర పార్కుల ఏర్పాటు

దేశవ్యాప్తంగా జవుళి పరిశ్రమ ప్రోత్సాహక చర్యలలో భాగంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌, అపరెల్‌ (పీఎం మిత్ర) పార్కుల ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిని వచ్చే ఐదేండ్లలో రూ.4,445 కోట్లతో నెలకొల్పుతారు. వీటి వల్ల ప్రత్యక్షంగా 7 లక్షలు, పరోక్షంగా 14 లక్షలు ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. 

వీటి ఏర్పాటుకు ఇప్పటికే 10 రాష్ట్రాలు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి చెందిన ‘స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌’ ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో పీఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తారు. పీఎం మిత్ర పార్కుల గురించి 2021-22 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. 

ఒకేచోట వెయ్యి ఎకరాలకు పైగా భూమి, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్న రాష్ట్రాలను  స్వాగతిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. పీఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పంజాబ్‌, ఒడిశా, గుజరాత్‌, రాజస్థాన్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌ ఆసక్తి కనబరిచాయి. 

పార్కు ఏర్పాటుకు స్థలాన్ని ‘స్విస్‌ చాలెంజ్‌ పద్ధతి’లో ఎంపిక చేస్తామని పీయూష్‌ గోయల్‌ తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్‌ భూముల్లో ఏర్పాటుచేసే పార్కుకు పెట్టుబడి కింద గరిష్ఠంగా రూ.500 కోట్లు, బ్రౌన్‌ఫీల్డ్‌ భూముల్లో రూ.200 కోట్లు కేంద్రం ఇస్తుంది. కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌సెన్టివ్‌ కింద మరో రూ.300 కోట్లు అందజేస్తుంది.

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనం బోనస్‌
 
అర్హులైన నాన్‌-గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.2020-21 సంవత్సరానికి సంబంధించి ఈ ఉత్పాదక బోనస్ నిర్ణయం తీసుకున్నట్లు దాదాపుగా 11 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరుగనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. 
 
ఈ బోనస్ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపుగా రూ 1,985 కోట్ల వ్యయభారం పడుతుంది. దేశంలో ప్రతి ఏటా దసరాముందు రైల్వే ఉద్యోగులకు ఇతరత్రా ప్రధాన ఉత్పత్తి సంస్థలకు, ఫ్యాక్టరీలకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఉత్పాదక ఆధారిత బోనస్‌ను గరిష్టంగా నెలకు రూ 7వేలుగా చెల్లిస్తారు. ఈ మేరకు ఒక్కో ఉద్యోగికి మొత్తం మీద ఎక్కువలో ఎక్కువ రూ 17,951 మేర బోనస్ దక్కుతుంది.
 
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.5000

ఇలా ఉండగా, కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎమ్‌వోఆర్టీహెచ్‌) ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడటంలో సహాయ పడే వ్యక్తికి రూ.5,000 నగదును బహుమతిగా ఇవ్వనున్నది. సమాజంలో ‘మంచి సమారిటన్ల’ను ప్రొత్సహించేందుకు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

అత్యవసర పరిస్థితిలో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడంలో సాధారణ ప్రజలను చైతన్య పరచడానికి ఈ పథకాన్ని లాంచ్ చేసినట్లు ఎమ్‌వోఆర్టీహెచ్‌ తెలిపింది. ప్రతి గుడ్ సమారిటన్‌కు రూ.5,000 నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తామని పేర్కొంది.

దీనితో పాటు ప్రతి ఏటా వీరిలో పది మందిని ఎంపిక చేసి లక్ష నగదు చొప్పున జాతీయ స్థాయి అవార్డుతో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ సత్కరించనున్నది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు జారీ చేసింది.

మరోవంక, పాత వాహనాన్ని ‘తుక్కు విధానం’లో ఇచ్చేసి కొత్త వాహనం కొనేవారికి రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ లభిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తెలిపింది. వ్యక్తిగత వాహనాలకైతే 25 శాతం వరకు, వాణిజ్య వాహనాలకైతే 15 శాతం వరకు రోడ్డు పన్నులో రాయితీని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇస్తాయని పేర్కొంది. ఈ రాయితీ వ్యక్తిగత వాహనాలకు 15 ఏండ్ల వరకు, వాణిజ్య వాహనాలకు 8 ఏండ్ల వరకు ఉంటుందని తెలిపింది.