రూ. 25 వేల కోట్లు రుణం విషయమై హైకోర్టు సీరియస్ 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ ద్వారా రూ. 25 వేల కోట్లు రుణం తీసుకురావడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా  గవర్నర్ సార్వభౌమాధికారాన్ని ఎలా అధిగమిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిటిషన్ వేశారు. ఆయన తరపున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. రుణం తీసుకునే అంశాలు, బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందంలో గవర్నర్ సార్వభౌమాధికారాన్ని అధిగమించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361కి ఇది పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు.
 
అలా చేసేందుకు తమకు అధికారం ఉందని ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత దవే వాదించారు. ఈ అంశానకి సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్లో తప్పనిసరిగా వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. గవర్నర్ సార్వభౌమాధికారాన్ని అధిగమించటంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది.
 
 గవర్నర్‌కు నోటీసులు జారీ చేసే ఆచారాన్ని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తూ.. ఈనెల 21వ తేదీ లోపు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
ఇలా ఉండగా,  రాష్ట్ర ప్రభుత్వం రుణ యజ్ఞం పేరిట అప్పులు తెస్తోందని వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు.  కొత్త కోణాల్లో అప్పు ఎలా తీసుకురావాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏపీ స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కింద రూ. 3వేల కోట్లు రుణం తెచ్చిందని, ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా జీవో ఇచ్చి 574 ఎకరాలు, ఆర్‌అండ్‌బీ ఆస్తులపై అప్పులు తేవాలని చూస్తోందని పేర్కొన్నారు.