కేంద్ర మంత్రి కుమారుడికి స‌మ‌న్లు

ల‌ఖీంపూర్ ఖేరీ ఘ‌ట‌న‌పై కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు ఆశిశ్ మిశ్రాకు యూపీ పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అడిగారు. ఆశిష్‌ మిశ్రా కోసం గాలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఐజీ లక్ష్మీ సింగ్ గురువారం తెలిపారు. 

రైతుల హత్య కేసులో ఆయన పేరు నమోదైందని, త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలు, సమాచారం ఆధారంగా కూడా దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.

ల‌ఖీంపూర్‌లో రైతుల‌ను తొక్కించిన వాహ‌నంలోనే ఆశిశ్ మిశ్రా ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌న కుమారుడు ఆ స‌మ‌యంలో అక్క‌డ లేడ‌ని అజ‌య్ మిశ్రా వాదిస్తున్నారు. ఆశిశ్ అక్క‌డ ఉన్న‌ట్లు ఒక్క ఆధారం ల‌భించినా తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌నీ ఆయ‌న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై గురువారం సుప్రీంకోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ కేసులో ఎంత మందిని అరెస్ట్ చేశారు వంటి పూర్తి వివ‌రాల‌తో శుక్ర‌వారం స‌వివ‌ర నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని యూపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

కాగా,   లఖింపూర్ ఖేరీ హింసాకాండలో 8 మంది మరణించిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ గురువారం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏకసభ్య కమిషన్ రెండు నెలల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు.