ఆర్‌ఎస్‌ఎస్‌ లేకపోతే దేశం రెండో పాక్ అయ్యేది

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లేకపోయి ఉంటే దేశం రెండో పాకిస్తాన్‌గా మారేదని కర్ణాటక మంత్రి ప్రభు చౌహాన్‌ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దేశభక్తి కలిగిన సంస్థ అని, ఇది మన దేశాన్ని కాపాడుతున్నదని ఆయన చెప్పారు. అందుకని, ఇక్కడి ప్రజలు ఏ ఇతర దేశం లేదా ప్రభుత్వాల గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. 

మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యల అనంతరం ప్రభు చౌహాన్‌ ఈ వాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ దేశంలోని 4,000 మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చిందని మంగళవారం కుమారస్వామి చెప్పారు. ఇప్పుడు వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాల ప్రకారమే పని చేస్తున్నారని ఆరోపించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ విషయాన్ని ఒక పుస్తకంలో చదివానని కుమారస్వామి చెప్పుకొచ్చారు.

దీనిపై కర్ణాటక బీజేపీ భగ్గుమన్నది. ఆర్ఎస్ఎస్ గురించి అవాకులు చవాకులు పేలకుండా జాగ్రత్తగా మాట్లాడాలని ప్రభు చౌహన్  హెచ్చరించారు. కుమారస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న జనతాదళ్ (ఎస్) పార్టీ దేశాన్ని ఎలా నడిపిందో, దేశానికి దాని సేవలు ఏమిటో ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. కాగా, సంఘ్ శాఖకు వెళ్లి కుమారస్వామి దేశభక్తికి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలని కర్ణాటక రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ హితవు చెప్పారు.

ఇలాఉండగా, ఆర్‌ఎస్‌ఎస్‌ చర్చలో రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే కూడా దూరారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో ఆర్‌ఎస్‌ఎస్ చాలా వరకు చొరబడిందని ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కారణంగానే గుల్బర్గా నుంచి ఖర్గే ఓటమిపాలైన విషయం తెలిసిందే.