తెలుగు అకాడమీలో రూ. 64.5 కోట్ల గోల్‌మాల్‌

తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి మొత్తం రూ. 64.5 కోట్ల నిధులు గోల్‌మాల్‌ చేశారని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. కార్వాన్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ నుంచి 26కోట్లు, రూ.11 కోట్లు సంతోష్‌ నగర్‌, చందనగర్‌ కెనరా బ్యాంక్‌లోని రూ. 6 కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. 
 
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, వారి తప్పిదంతోనే కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. మాయమైన నిధులను బ్యాంకులే అకాడమీకి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అకాడమీకి, బ్యాంకులకు దళారిగా వ్యవహరించిన కీలక సూత్రధారి,  విశాఖపట్టణానికి చెందిన చందూరి వెంకట కోటి సాయికుమార్‌ వాటానే ఇందులో రూ.20 కోట్లుగా తేలింది. 
 
ఈ కుంభకోణంలో కీలకనిందితునిగా ఉన్న సాయికుమార్‌పై గతంలో 3 కేసులున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జనవరి నుంచే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముఠా మళ్లించినట్లు తేల్చారు. సాయికుమార్ 2015 ఎపి హౌసింగ్ బోర్డ్ స్కాంలోనూ సిఐడి విచారించిందని పేర్కొన్నారు. అదేవిధంగా మరో రూ.25 కోట్ల మోసం కేసులో సాయికుమార్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారని సిపి వివరించారు.
 
కాగా, బ్యాంకు ఏజెంట్లుగా ఉన్న సాయికుమార్‌, రాజ్‌కుమార్‌, వెంకట్‌తో పాటు చందానగర్‌ కెనరాబ్యాంకు మేనేజర్‌ సాధనతో పాటు మొత్తం పదిమందిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు అకాడమీలోని నిధులను కాజేసేందుకు నిందితుల ఏడాది క్రితం నుంచే కుట్ర పన్నారని విచారణలో తేలిందని సిపి తెలిపారు. 
 
నిందితులు ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు తమ దగ్గరే ఉంచుకుని నకిలీ సర్టిఫికెట్లు అకాడమీకి ఇచ్చారని,  ఒరిజినల్ ఎఫ్‌డిలతో రూ. 64.5 కోట్ల రూపాయలు ఈ ముఠా డ్రా చేసిందని తెలిపారు. అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేశ్‌కు, అక్రమాలకు పాల్పడిన ముఠాతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలిపారు.
అకాడమీలోని ఉన్నతాధికారులకు తెలియకుండా రమేశ్ ఈ తతంగమంతా నడిపాడని, బ్యాంకు అధికారుల సహాయంతో నకిలీ డిపాజిట్ పత్రాలను సృష్టించి అకాడమీ ఉన్నతాధికారులను నమ్మించాడని అంజనీ కుమార్ తెలిపారు. వీరికి యూబిఐ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీ, కెనరా బ్యాంకు మేనేజర్ సహకరించారని, ఇందుకు వారికి సైతం కమీషన్లు ముట్టినట్లు దర్యాప్తులో వెల్లడైందని వివరించారు. గతంలో అక్రమాలకు పాల్పడిన ముఠాలో కొందరిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. మరో 9 మందిని అనుమానితులగా భావిస్తున్నట్లు చెప్పారు.
 
‘అకాడమీ సభ్యులు లాగా అగ్రసేన్‌ బ్యాంకులో ఖాతాలు తెరిచి.. డిపాజిట్ల డబ్బులన్నీ అగ్రసేన్‌ బ్యాంకు కోఆపరేటివ్‌ సొసైటీ ఖాతాలోకి మళ్లించారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే  ఈ ముఠా డబ్బులన్నీ పంచుకున్నారు. ఈ డబ్బులతో కొందరు నిందితులు ఆస్తులు కొన్నారు. మరికొందరు కొంతమందికి అప్పులు ఇచ్చారు. 
 
“ఈ డబ్బుల్లో అధికశాతం మాత్రం సాయికుమార్‌కి వెళ్లాయి. అగ్రసేన్‌ బ్యాంకు ఖాతాలో ఉన్న కొంత నగదును నిలుపుదల చేశాం.ఈ డబ్బుల్లోనే కొంత మార్కంటైల్‌ బ్యాంక్‌కు 10శాతం కమిషన్‌ వెళ్లింది” అని సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.