అసెంబ్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను అవమానిస్తారా?

అసెంబ్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను అవమానించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారా అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ సభా సంప్రదాయాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పద్మశ్రీ అవార్డుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని,  ప్రధాన మంత్రి, హోంమంత్రితో మాట్లాడినా ఫలితం లేదంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సంజయ్‌ తప్పుపట్టారు. 

పర్యాటక అభివృద్ధి, విమానాశ్రయాల అనుమతి సహా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేసీఆర్‌ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని సంజయ్‌ స్పష్టం చేశారు. పద్మశ్రీ అవార్డుల్లో పారదర్శక విధానాన్ని అవలంబించడం వల్లే పేదలైనప్పటికీ మన రాష్ట్రం నుంచి వనజీవి రామయ్య, ఆసు యంత్ర సృష్టికర్త చింతకింది మల్లేశం వంటి నిష్ణాతులను పద్మ అవార్డుల వరించాయిని ఆయన గుర్తు చేశారు. 

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదనడం శుద్ధ అబద్ధం అని సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు సోయి లేనప్పుడే విదేశాంగ మంత్రి జై శంకర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు యునెస్కో సభ్యదేశాలను ఒప్పించి మెప్పించి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలంపూర్ జోగులాంబ దేవాలయానికి కేంద్రం రూ.60 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక తప్పిదాలతో లేటైన విషయం వాస్తవం కాదా అని అడిగారు. 

కేంద్ర మంత్రిని ఇంటికి పిలిచి తిండి పెట్టి అడిగినా విమానాశ్రాయాలకు గుర్తింపు ఇస్తలేరంటూ అవమానిస్తారా? అంటూ నిలదీశారు. “మీ ఆహ్వానాన్ని మన్నించి ప్రగతి భవన్‌కు వస్తే కేంద్ర మంత్రిని ఉద్దేశించి అవమానకరంగా అసెంబ్లీలో దిగజారి మాట్లాడతారా? ఇదేనా మీ సంస్కారం? ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ఇవ్వాలి’’ అని సంజయ్‌ ధ్వజమెత్తారు. 

కాగా, దళితబంధు లబ్ధిదారుల ఖాతాలు ఫ్రీజ్‌ చేశారంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)కు బీజేపీ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై న్యాయపరంగానూ పోరాటం చేయాలని పార్టీ యోచిస్తోంది. 

మరోవంక, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులను సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ  బండి సంజయ్‌కి లేఖ రాశారు. కరోనా కారణంగా ఫస్ట్‌ ఇయర్‌లో కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యామని, తమను సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేయాలని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గతంలో సంజయ్‌ని కలిశారు.