శిశుమందిర్ పాఠ‌శాల‌ల్లో బ‌తుక‌మ్మ సంబ‌రాలు

తెలంగాణ సంస్క్ర‌తిలో పేరెన్నిక గ‌న్న బ‌తుక‌మ్మ సంబ‌రాలు సంప్ర‌దాయ బ‌ద్దంగా ప్రారంభం అయ్యాయి.  శ్రీ స‌ర‌స్వ‌తీ విద్యాపీఠంకు చెందిన అనేక పాఠ‌శాల‌ల్లో సంబ‌రాల‌కు శ్రీకారం చుట్టారు. సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించిన బాల బాలిక‌లు ఉత్సాహంగా  పాఠ‌శాల కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకొన్నారు. 

బ‌తుక‌మ్మ ఉత్స‌వాల ప్రాశ‌స్త్యాన్ని ఆచార్యులు, మాతాజీలు  ఈ సంద‌ర్భంగా  పిల్ల‌ల‌కు గుర్తు చేశారు. బ‌తుకుని కొలుచుకొనే పండుగగా బ‌తుక‌మ్మ‌ను చెప్పుకోవ‌చ్చు. ద‌స‌రాల‌కు ముందు రోజునుంచే ఈ ఉత్స‌వాల‌కు తెర లేస్తుంది. ద‌స‌రాల్లో  ఉత్సాహంగా ఈ పండ‌గ జ‌రుపుకోవ‌టం ఆన‌వాయితీ.

అమ్మ‌వారిని ల‌క్ష్మీదేవి, గౌరీదేవి, స‌ర‌స్వ‌తీ రూపంగా భావిస్తూ… బ‌తుకుని ప్ర‌సాదించే అమ్మ‌గా కొల‌వ‌ట‌మే ఈ పండ‌గ ప్రాశ‌స్త్యం. తీరు తీరైన పూల‌తో అలంక‌రించ‌టం, బ‌తుకులోని స‌త్యాల‌ను పాట‌లుగా మ‌ల‌చ‌టం ఒక చ‌క్క‌ని అనుభూతి అన‌టంలో సందేహం లేదు.

శ్రీ స‌ర‌స్వ‌తీ విద్యాపీఠం ప్ర‌ధాన ప్రాంగ‌ణ‌ము బండ్ల‌గూడ‌లోని శ్రీ విద్యార‌ణ్య ఆవాస విద్యాల‌యంలో సంప్ర‌దాయ బ‌ద్దంగా బ‌తుక‌మ్మ సంబ‌రాలు నిర్వ‌హించుకొన్నారు. మాధ‌వ‌న‌గ‌ర్, కార్వాన్, మాద‌న్న‌పేట‌,  కూక‌ట్ ప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో ఉత్సాహంగా జ‌రుపుకొన్నారు. ప‌రిగి, క‌రీంన‌గ‌ర్, బ‌జార్ హ‌త్నూర్ వంటి చోట్ల పిల్లలు సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా పండ‌గ చేశారు. 

మాతాజీలు, పిల్ల‌లు ఉత్సాహంగా సంబురాల్లో పాలు పంచుకొన్నారు. అనేక చోట్ల పిల్ల‌ల‌కు ఆటల పోటీలు, సాంప్ర‌దాయ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధ‌న‌లను పాటిస్తూ సామాజిక దూరంతో కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.