రాజ్యసభలో ఒకే ఎంపీకి 100 శాతం హాజరు

రాజ్యసభలో గత మూడేళ్లుగా ఒక్క రోజు కూడా గైరాజరు కాకుండా హాజరవుతున్న ఎంపీ ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయనే ఏఐడీఎంకే సభ్యుడైన 75 ఏళ్ల వృద్ధుడు ఎస్ ఆర్ బాలసుబ్రమణ్యం. గత 7 సమావేశాల్లో 138 రోజూలూ సభకు హాజరైన ఏకైక వ్యక్తిగా నిలిచారు. 

ఆయన ప్రస్తుతం రాజ్యసభలో ఏఐడీఎంకే ఉపనాయకుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో మూడు సార్లు తమిళనాడు శాసనసభకు, ఒక సారి లోక్ సభకు ఎన్నికయ్యారు. మే, 1996 నుండి మార్చ్, 1998 వరకు కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. 1991 నుండి 1996 వరకు తమిళనాడు శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2001, 2002 లలో తమిళ్ మానిలా కాంగ్రెస్ పక్ష నేతగా, 2002 నుండి 2006 వరకు కాంగ్రెస్ పక్ష నేతగా శాసనసభలో వ్యవహరించారు. జూన్, 2016లో ఏఐడీఎంకే ను నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యే సభ్యుల సంఖ్యను మొదటిసారి లెక్కించారు. చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశాలతో  గత ఏడు సమావేశాల పనితీరును అధికారులు లెక్కించారు. దీని ప్రకారం సభకు ప్రతిరోజూ 78 శాతం మంది హాజరవుతున్నట్లు తేలింది. అందులో 30 శాతం మంది ప్రతిరోజూ క్రమం తప్పకుండా వస్తున్నట్లు వెల్లడైంది. 

2019 నుంచి 2021 మధ్యకాలంలో జరిగిన 248వ సమావేశం నుంచి 254వ సమావేశం వరకు జరిగిన 138 సిట్టింగ్ ల లెక్కలను ఇప్పుడు విశ్లేషించారు. ఏడు సమావేశాల్లో తాజాగా ముగిసిన 254వ సమావేశానికి గరిష్ఠంగా 82.57శాతం మంది సభ్యులు రోజూ హాజరయ్యారు. ఏడు సమావేశాలకు 29.14శాతం మంది సభ్యులు ప్రతిరోజూ హాజరయ్యారు. కేవలం 1.90శాతం మంది పలు కారణాల వల్ల ఒక్క రోజూ కూడా సభకు రాలేదు. 251వ సమావేశాల సమయంలో 34 మంది సభ్యులు అంటే 15.27 శాతం మంది ప్రతిరోజూ హాజరయ్యారు. 

254వ సమావేశాల నాటికి ఆ సంఖ్య 98 అంటే 46శాతానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీజీ వెంకటేష్, మరో అయిదుగురు సభ్యులు ఆరు సమావేశాలకు అన్ని రోజులు హాజరయ్యారు. ఏపీకే చెందిన కనకమేడల రవీంద్రకుమార్, మరో ఏడుగురు 5 సమావేశాలకు పూర్తిగా వచ్చారు.