రైతుల మీదకు కారులో మా కొడుకు లేడు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు దూసుకెళ్లిన కారు తమదే అని కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. అయితే అందులో తన కొడుకు లేడని స్పష్టం చేశారు. అందుకు వేలాదిమంది సాక్ష్యులుగా ఉన్నారని తెలిపారు. పైగా, కారు దూసుకువెళ్లడంతో జరిగిన హింసాకాండతో రైతులకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.  రైతుల ముసుగులో తీవ్రవాదులే ఈ హింసాకాండకు బాధ్యులను ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మ‌ర‌ణించగా, మరో నలుగురు మృతి చెందారు.
కారు దూసుకువెళ్ల‌డం, ఆ త‌ర్వాత హింస చెల‌రేగిన స‌మ‌యంలో అక్క‌డ తాను కానీ, త‌న కుమారుడు కానీ లేర‌ని మంత్రి తెలిపారు. రైతుల‌పైకి వెళ్లిన మ‌హేంద్ర థార్ కారు త‌మ‌దే అని మొద‌టి రోజు నుంచి చెబుతున్నాన‌ని, అది తమ పేరు మీదే రిజిస్ట‌ర్ అయి ఉంద‌ని, త‌మ పార్టీ వ‌ర్క‌ర్ల‌ను పిక‌ప్ చేసుకునేందుకు వెళ్తోంద‌ని ఆయనచెప్పారు.
ఆ స‌మ‌యంలో తన కొడుకు మ‌రో వేదిక వ‌ద్ద ఉన్నార‌ని, మ‌రో ఈవెంట్‌ను అత‌ను ఆర్గ‌నైజ్ చేస్తున్నాడ‌ని మంత్రి తెలిపారు. ల‌ఖింపుర్ హింస స‌మ‌యంలో మ‌రో చోట త‌మ కుమారుడు ఉన్నాడ‌ని, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయ‌ని, కాల్ రికార్డులు, సీడీఆర్‌, లొకేష‌న్ల‌ను చెక్ చేస్తే ఆ విష‌యం తెలుస్తుంద‌ని మంత్రి పేర్కొన్నారు.
ఆశిష్ మిశ్రా మ‌రో చోటు ఉన్నాడ‌న్న విష‌యంలో అఫిడ‌విట్ ఇచ్చేందుకు వేల మంది ఆస‌క్తిగా ఉన్న‌ట్లు మంత్రి అజ‌య్ మిశ్రా తెలిపారు. త‌మ‌కు కారుకు చెందిన డ్రైవ‌ర్ మృతిచెందాడ‌ని, అత‌నితో పాటు మ‌రో ఇద్ద‌రు పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా మృతిచెందిన‌ట్లు చెప్పారు. కారుతో పాటు మ‌రో ఫార్చున‌ర్‌ను కాల్చేశార‌ని వివరించారు.
కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా బుధవారం ఉదయం ఢిల్లీ నార్త్‌ బ్లాక్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి జరిగిన ఘటనపై వివరించారు. రైతులపైకి దూసుకెళ్లి ఇద్దరి మరణానికి కారణమైన వాహనంలో తన కుమారుడు లేడని ఇప్పటికే పలు మార్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని అమిత్‌ షాకు ఆయన చెప్పినట్లు తెలుస్తున్నది.

కాగా, తన రాజీనామా కోసం ఎలాంటి ఒత్తిడి లేదని అజయ్‌ మిశ్రా మీడియాతో స్పష్టం చేశారు. నేనెందుకు రాజీనామా చేయాలి? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు

తన కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఈ ఘటనలో ఉన్నట్లు ఒక్క ఆధారం చూపిన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.  లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనపై నిరాధార అరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. బీజేపీ అధిష్టానం తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ​