పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు రూ.1 లక్ష కోట్లు ఇచ్చాం

 ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం క్రింద పేదల బ్యాంకు ఖాతాలకు రూ.1 లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వం జమ చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పీఎంఏవై-అర్బన్ పథకం క్రింద ఉత్తర ప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 75 వేల మంది లబ్ధిదారులకు  మంగళవారం డిజిటల్ విధానంలో అప్పగించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 

‘‘స్వాతంత్య్రం@75-నూతన పట్టణ భారతం : పరివర్తన చెందుతున్న పట్టణ దృశ్యం’’ సదస్సు, ఎక్స్‌పోను  మోదీ ప్రారంభించారు. స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకాల క్రింద ఉత్తర ప్రదేశ్‌లో 75 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 

లక్నో, కాన్పూరు, వారణాసి, ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్, ఝాన్సీ, ఘజియాబాద్  నగరాలకు  FAME-II క్రింద 75 బస్సులను ప్రారంభించారు. ఇళ్ళ లబ్ధిదారులతో వర్చువల్ విధానంలో మాట్లాడుతూ ఇళ్ళు పొందిన 75 వేల మంది తమ కొత్త ఇళ్ళలో దసరా, దీపావళి, ఈద్ పండుగలను ఆనందంగా జరుపుకుంటారని పేర్కొన్నారు.

ఈ లబ్ధిదారుల్లో 80 శాతం మంది మహిళలే కావడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధాని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌ను పరిపాలించిన గత ప్రభుత్వం పేదలకు ఇళ్ళను నిర్మించాలని కోరుకోలేదని ధ్వజమెత్తారు. 2017కి పూర్వం ఉత్తర ప్రదేశ్‌లో పీఎంఏవై పథకం క్రింద ఇళ్ళ నిర్మాణానికి రూ.18,000 కోట్లు మంజూరైనా 18 ఇళ్ళనైనా నిర్మించలేదని విమర్శించారు. 

ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం 9 లక్షల ఇళ్ళను నిర్మించిందని ప్రధాని పేర్కొన్నారు. మురికివాడల్లో నివసించే 3 కోట్ల కుటుంబాలు పక్కా ఇళ్ళు పొందడంతో, ఒకే ఒక పథకంతో లక్షాధికారులయ్యారని ప్రధాని తెలిపారు. 

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద 17.3 ల‌క్ష‌ల ఇండ్ల‌ను మంజూరీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 8.8 ల‌క్షల మంది ల‌బ్ధిదారుల‌కు ఇండ్ల‌ను అంద‌జేసిన‌ట్లు కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్ తెలిపారు. ల‌క్నోలో అర్బ‌న్ స‌ద‌స్సును నిర్వ‌హించ‌డం ఈ న‌గ‌రానికి వ‌న్నె తెచ్చిన‌ట్లు అవుతుంద‌ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. 

భారత్ ను కొత్త‌గా చూడాల‌న్న క‌ల ప్ర‌ధానికి ఉంద‌ని, దాని కోసం ఆయ‌న నిరంత‌రంగా శ్ర‌మిస్తున్నార‌ని పేర్కొంటూ  భార‌త్ కూడా ఆయ‌న ఆశించిన మార్పును గ‌మ‌నిస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ వెల్ల‌డించారు.

ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌కు చేరిన తర్వాత ప్రధాని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర  మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి, గవర్నర్ ఆనందీబేన్ పటేల్‌తో కలిసి నడుస్తూ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన మూడు ఎగ్జిబిషన్లను తిలకించారు. ఈ సందర్భంగా అయోధ్య అభివృద్ధి మాస్టర్‌ప్లాన్ గురించి కూడా వాకబు చేశారు.