ఆఫ్ఘన్ లో తిరిగి మదరసా చదువులు… పాత డిగ్రీలు చెల్లవు

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఉన్నత విద్యపై కొత్త డిక్రీని జారీ చేసింది. ఈ డిక్రీ ప్రకారం గత 20 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన విద్యార్థుల డిగ్రీలు చెల్లవు. అష్రఫ్ ఘనీ లేదా హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యలో డిగ్రీలు పొందిన విద్యార్థులను గుర్తించకూడదని ఆఫ్ఘన్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ చెప్పినట్లు సమాచారం. 

ఈ ప్రభుత్వాల కాలంలో మతపరమైన విద్యకు విద్యా రంగంలో ప్రాముఖ్యత ఇవ్వలేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తున్నది. పీహెచ్‌డీ చేసిన వారి కంటే మదర్సాల్లో చదువుతున్న వారే ఎక్కువ గుణవంతులు, విద్యావంతులుగా ఉంటున్నారని ఆ సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తున్నది. గత 20 ఏళ్లుగా అక్కడ విస్తరిస్తూ వస్తున్న ఆధునిక విద్య స్థానంలో తిరిగి మదరాస విద్యను ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.

ఆఫ్ఘన్ వార్తా సంస్థ టోలో న్యూస్ ప్రకారం, కాబూల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో విద్యా మంత్రి హక్కాని సమావేశమై గత 20 ఏండ్లలో విద్యారంగం గురించి చర్చించారు. మతపరమైన విద్యకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల హక్కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.  2000 నుంచి 2020 వరకు అన్ని రకాల గ్రాడ్యుయేషన్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలను గుర్తించవద్దని ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఈ 20 ఏండ్లలో పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని అన్నట్లు కూడా తెలుస్తున్నది.

పౌరులకు పాస్‌పోర్టులు జారీ

 కాగా,  తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ కొత్త ప్రభుత్వం తమ పౌరులకు  పాస్‌పోర్టులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కౌన్సిల్ మినిస్టర్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ నిన్న నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

పౌరులకు పాస్‌పోర్టులతోపాటు తజ్కిరా (జాతీయ ఐడీ కార్డు)ను కూడా జారీ చేస్తామన్నారు. ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఈ రెండింటి జారీ నిలిచిపోయింది. ఇప్పుడు వీటిని పునరుద్ధరించాలని తాలిబన్ ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు 5,000-6,000 పాస్‌పోర్టులు జారీ చేస్తామని పాస్‌పోర్టు కార్యాలయం తాత్కాలిక హెడ్ అలామ్ గుల్ హక్కానీ తెలిపారు.

కార్యాలయంలోని మహిళా ఉద్యోగులు మహిళలకు సంబంధించిన పాస్‌పోర్టు వ్యవహారాలు చూస్తారని పేర్కొన్నారు. లక్ష పాస్‌పోర్టులు ప్రాథమిక దశలో పరిశీలనలో ఉండగా, 25 వేల పాస్‌పోస్టులు చివరి దశలో ఉన్నాయని అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖరీ సయీద్ ఖోస్తి తెలిపారు.

13 మంది మైనారిటీ పౌరుల ఊచకోత

అఫ్ఘాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లకు లొంగిపోయిన హజరస్‌కు తెగకు చెందిన 13 మందిని తాలిబన్లు అమానుషంగా చంపివేశారని ప్రముఖ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. అఫ్ఘాన్‌లోని డేకుండి ప్రావిన్సుకు చెందిన కహోర్ గ్రామంలో ఆగస్టు 30న ఈ మారణకాండ చోటుచేసుకుందని ఆమ్నెస్టీ తెలిపింది. 
 
హజరస్ తెగకు చెందిన మృతులలో 11 మంది ఇదివరకటి అఫ్ఘాన్ జాతీయ భద్రతా దళాలలో సభ్యులుగా పనిచేశారని, ఇద్దరు పౌరులు, ఒక మహిళ కూడా మృతులలో ఉన్నారని ఆమ్నెస్టీ పేర్కొంది. అఫ్ఘాన్‌లోని 3.60 కోట్ల జనాభాలో హజరస్ జనాభా సుమారు 9 శాతం ఉంటుంది.