ప్రధాని మోదీకి రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ పోలార్‌ స్టార్‌

ప్రధాని మోదీకి రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ పోలార్‌ స్టార్‌
తమ దేశ అత్యున్నత పురస్కారం ‘రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ పోలార్‌ స్టార్‌, కమాండర్‌ గ్రాండ్‌ క్రాస్‌’తో ప్రధాని నరేంద్ర మోదీని స్వీడన్‌ సత్కరించింది. ప్రధాని మోదీ అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం ఇది. రెండు రజుల స్వీడన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ఇక్కడి గోథెన్‌బర్గ్‌కు చేరుకున్నారు.  నెదర్లాండ్స్‌‌లో పర్యటన ముగించుకొని ఆదివారం సాయంత్రం స్వీడన్‌ ‌వెళ్లిన మోదీకి స్థానిక గోతెన్‌ ‌బర్గ్‌ ‌విమానశ్రయంలో స్వీడన్ ప్రధానమంత్రి క్రిస్టర్స్‌ సన్ విమానాశ్రాయానికి స్వయంగా వచ్చి  ఆహ్వానం పలికారు.
సాయుధ దళాలు సైనిక వందనం సమర్పించాయి. తన స్వీడెన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింతగా బలపడతాయని మోదీ  విశ్వాసం వ్యక్తం చేశారు.  ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, రక్షణతో పాటు మరిన్ని రంగాలలో ఇరు దేశాల సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్నట్లు మోదీ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన గురించి ప్రస్తావిస్తూ, ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఇది మరొక మైలురాయిగా నిలుస్తుందని క్రిస్టర్సన్ తెలిపారు. “నేడు భారతదేశంలో సుమారు 300 స్వీడిష్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో చాలా వాటికి సొంత ఉత్పత్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. భారతీయ కంపెనీలు కూడా స్వీడన్‌లో పెట్టుబడులను ముమ్మరం చేస్తుండటంతో, ఈ సంబంధం మరింత బలపడుతోంది,” అని క్రిస్టర్సన్ పేర్కొన్నారు.

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్‌కు మద్దతు తెలిపిన స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం మొత్తం మానవాళికే తీవ్రమైన సవాల్ అని పేర్కొన్న మోదీ, టెర్రరిజం, దానికి మద్దతిచ్చే శక్తులపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  అనంతరం ఆయన ప్రముఖ నౌక నిర్మాణం, కంటైనర్ల సంస్థ అయిన మేర్క్స్‌ ‌సంస్థ ఛైర్మన్‌ ‌రాబర్ట్‌ ‌మేర్క్స్‌ ఉగ్లాతో సమావేశమయ్యారు. భారత్‌‌లో మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు విస్తార అవకాశాలున్నాయని, అధిక పెట్టుబడులు పెట్టాలని ప్రధాని ఆహ్వానించారు.
 
గోతెన్‌బర్గ్‌లో నిర్వహించిన యూరోపియన్ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మోదీ మాట్లాడుతూ రక్షణ రంగంలో భారత్-స్వీడన్ సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. కేవలం కొనుగోలు-అమ్మకాల సంబంధం కాకుండా దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా ఈ అనుబంధం మారుతోందని చెప్పారు. స్వీడిష్ కంపెనీలు భారత్‌లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. 
 
“గత 12 ఏళ్లుగా భారత్‌ సంస్కరణలు, పనితీరు, మార్పు అనే మంత్రంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ రాజకీయ సంకల్పంతో రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్ పూర్తి వేగంతో దూసుకెళ్తోంది” అని మోదీ పేర్కొన్నారు. యువ జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులు భారత్‌ను ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చాయని చెప్పారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, టాలెంట్ మొబిలిటీ రంగాల్లో భారత్-యూరప్ భాగస్వామ్యం మరింత పెరగాలని ప్రధాని కోరారు.
ఇండియా-యూరప్ సీఈఓ రౌండ్‌టేబుల్‌ను ప్రతి ఏడాది నిర్వహించాలని, యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీలో “ఇండియా డెస్క్” ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు, స్వీడన్ పర్యటనలో ఉన్న మోదీపై యూరప్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సీఈవోలు ప్రశంసలు కురిపించారు. గత కొన్నేళ్లుగా భారత్‌లో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణల వల్ల దేశం పూర్తిగా మారిపోయిందని వారు అభిప్రాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.