* మంత్రివర్గంలో వారసులకు పెద్ద పీట
కేరళ నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ నేత వీడీ సతీశన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం, ఐయూఎంఎల్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ ప్రమాణస్వీకారంతో కేరళ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా సతీశన్ గుర్తింపు పొందారు. సతీశన్‌తో కలిసి మరో 20 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. దాంతో ముఖ్యమంత్రితో కలిపి కొత్త మంత్రివర్గంలో మొత్తం 21 మంది సభ్యులు అయ్యారు.
ఇక ముఖ్యమంత్రి పదవి సహా కాంగ్రెస్ పార్టీకి 11 మంత్రి పదవులు దక్కాయి. మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కు ఐదు మంత్రి పదవులు లభించాయి. కాగా, కాంగ్రెస్ అంటేనే `వారసత్వ రాజకీయాలు’కు పేరొందింది. పదేళ్ల తర్వాత కేరళలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పలువురు రాజకీయ కుటుంబాల నుండి, రాజకీయ వారసత్వంగా మంత్రి పదవులు పొందబోతుండటం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ నుండి కొత్త మంత్రులుగా పి.సి. విష్ణునాథ్, రోజీ ఎం. జాన్, బిందు కృష్ణ, టి. సిద్దిక్, కె.ఎ. తులసి, ఓ.జె. జనీష్‌లకు కూడా చోటు లభించింది. సీనియర్ శాసనసభ్యుడు తిరువంచూర్ రాధాకృష్ణన్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా నియమించాలని నిర్ణయించగా, కొత్త మంత్రివర్గంలో దివంగత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్‌కు మాత్రమే చోటు దక్కలేదు. ఐయూఎంఎల్ పార్టీ నుండి, కలమస్సేరి ఎమ్మెల్యే వి.ఇ. అబ్దుల్ గఫూర్ దివంగత వి.కె. ఇబ్రహీంకుంజు కుమారుడు కాగా, ఎర్నాడ్ ఎమ్మెల్యే పి.కె. బషీర్ ఆ పార్టీ దిగ్గజ నాయకుడు పి. సీతి హాజీ కుమారుడు.
కేరళ కాంగ్రెస్ నాయకులు అనూప్ జాకబ్ (పిరవోం), అపు జాన్ జోసెఫ్ (తొడుపుళ) వరుసగా టి.ఎం. జాకబ్, పి.జె. జోసెఫ్‌ల కుమారులు. వీరితో పాటు ఆర్ఎస్పి నాయకుడు బేబీ జాన్ కుమారుడు షిబు బేబీ జాన్‌కు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. సతీశన్ సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నుండి, పాలక్కాడ్ లోక్‌సభ సభ్యుడు వి.కె. శ్రీకందన్ సతీమణి కె.ఎ. తులసి, మాజీ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్ కుమారుడు కె. మురళీధరన్‌లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ముఖ్యమంత్రి పీఠం కోసం కె.సి. వేణుగోపాల్, రమేష్ చెన్నితాల, సతీశన్ మధ్య అంతర్గత పోరు జరిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ దానిని “ప్రజాస్వామ్య సౌందర్యం”గా అభివర్ణించింది. ఇప్పుడు, రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన ఇంతమంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ఉన్నత స్థానం కల్పించడాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజమైన “ప్రజాస్వామ్య సౌందర్యం”గా వెల్లడి అవుతుంది.

More Stories
ప్రధాని మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్
బెంగాల్లో వేగంగా అడుగులు వేస్తున్న సువెందు ప్రభుత్వం
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్