లఖింపూర్ హింసలో ఉగ్రవాదులు?.. వేగంగా స్పందించిన యోగి 

గత సంవత్సరకాలంకు పైగా సాగుతున్న రైతుల ఆందోళన సందర్భంగా ఆదివారం ఉత్తర ప్రదేశ్ లో లఖింపూర్ ఖేరి వద్ద హింసాయుత సంఘటనలు చోటుచేసుకొని, 9 మంది మృతి చెందడం వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉండవచ్చనే బలమైన అనుమానాలు వెల్లడి అవుతున్నాయి. 

చనిపోయిన వారిలో నలుగురు మాత్రమే రైతులు కాగా, మరో నలుగురు బిజెపికి చెందిన వారు, వారి డ్రైవర్ ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వేగంగా స్పందించి, 24 గంటల లోపే పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం అందరి ప్రశంసలు అందుకొంటున్నది. బహుశా ఈ మధ్య కాలంలో దేశంలో మరెక్కడా ఆ విధంగా జరిగలేదు. 

బిజెపికి చెందిన వారిని వెంటాడుతూ, కర్రలతో కొడుతూ చంపడం వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నది. రైతుల మరణాలకు సంబంధించిన వీడియోలు ఏవీ బైటకు రాకపోవడం గమనార్హం. అంటే రైతులను చంపే ప్రయత్నం జరగలేదని, కుట్రపూరితంగా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, హింసాకాండను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారని భావించవలసి వస్తున్నది. 

వాస్తవానికి యుపి ఉపముఖ్యమంత్రి కేశవ్ మౌర్య హెలికాఫ్టర్ లో వస్తున్నారని తెలిసి, అక్కడ నిరసన తెలపడం కోసం రైతులు బయలుదేరారు. కానీ అంతలో ఆయన రోడ్ మార్గంలో వస్తున్నారని తెలిసి రైతులు తమ నిరసనను విరమించుకొని సమయంలో ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారింది. దానితోనే ఉద్రిక్తలు చెలరేగి, హింసకు దారితీసిన్నట్లు తెలుస్తున్నది. 

ఆ వీడియో పంపింది ఎవ్వరు?

కేంద్ర మంత్రి అజయ్‌ కుమార్‌దిగా భావిస్తున్న పాత వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆయనరైతులను ఉద్దేశించి ‘మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి నాకు రెండు నిమిషాలు చాలు” అని అంటున్నట్టుగా ఉంది. ‘‘నాతో తలపడండి. కేవలం 2 నిమిషాల్లో మిమ్మల్ని దారికి తెస్తా. నేను మంత్రినో, ఎంపీనో, ఎమ్మెల్యేనో మాత్రమే కాదు. అంతకు ముందు నుంచి ప్రజలకు నేనెవరో తెలుసు. సవాళ్ల నుంచి నేను పారిపోను’’అని చెబుతున్నట్టుగా ఉంది. దానికింద అభ్యంతరకరమైన వాఖ్యలు కూడా ఉన్నాయి. 

ఒకే వాట్స్ అప్ గ్రూప్ నుండి ఈ వీడియోను 2,500 మందికి పైగా ఆ సమయంలో పంపినట్లు తేలింది. పైగా దానికి అడ్మిన్ గా ఉన్నవ్యక్తి ఒక సిఖ్ అని, అతనికి ఖలిస్థాన్ లతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. వాస్తవానికి తాను రైతులను ఉద్దేశించి అనలేదని, మొత్తం వీడియో వింటే తెలుస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తున్నారు. రైతుల మధ్యలో చేరి అరాజకం సృష్టిస్తున్న శక్తుల గురించి అన్నట్లు కూడా తెలిపారు. 

 కొన్ని బైట శక్తులు వచ్చి, అక్కడ హింసను రెచ్చగొట్టిన్నట్లు ఇప్పుడు స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయి. రైతుల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు, ఉగ్రవాదుల మద్దతుదారులు అక్కడకు చేరుకొని ఉద్రిక్త పరిస్థితులు సృష్టించినట్లు కనిపిస్తున్నది. 

ప్రజల మనిషి అజయ్ మిశ్రా 

బిజెపి మండల అధ్యక్షుడిని వెంటాడి, చంపుతున్న గుంపు స్థానిక ఎంపీ, కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా తనను దాడి చేయమని పంపారని చెప్పమని బలవంతం చేయడం స్పష్టంగా కనిపిస్తున్నది. అజయ్ మిశ్రా స్థానికంగా ఒక సారి  ఎమ్యెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన రైతు కుటుంభం నుండి వచ్చారు. ప్రజల అందరికి అందుబాటులో ఉండే నేతగా పేరొందారు. 

అటువంటి అజయ్ మిశ్రా కుమారుడు తమ స్వస్థలంలో రైతులపైకి కారు పోనిచ్చి, చంపారనే ఆరోపణలు విశ్వసనీయతను కలిగించడం లేదు. నేరమయ రాజకీయాలకు పేరొందిన ఉత్తర ప్రదేశ్ లో పార్లమెంటరీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనే కొద్దిమందిలో అజేయ మిశ్రా ఒకరు. ఇంతవరకు ఆ రాష్ట్రం నుండి `సంసద్ రత్నా’ పురస్కారం పార్లమెంట్ నుండి పొందిన ఏకైక నేత ఆయనే  కావడం గమనార్హం. 

జనవరి 26న ఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవంనాడు ఎర్రకోట వద్ద రైతుల ముసుగులో జాతీయ పతాకంను అవమానపరుస్తూ హింసను రెచ్చగొట్టిన తరహాలోనే ఇక్కడ కూడా హింసాకాండకు కుట్రపూరితంగా కొన్ని వర్గాలు వ్యవహరించినట్లు స్పష్టం అవుతున్నది. 

మరో కొద్దినెలల్లో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడం కోసమే ఈ హింసాకాండను సృష్టించినట్లు భావించవలసి వస్తున్నది. రైతుల మరణాలను రాజకీయ చేసే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలు నలుగురు ఇతరుల మృతికి ఎవ్వరు బాధ్యులో పెదవి విప్పక  పోవడం, కనీసం సానుభూతి కూడా చూపకపోవడం గమనార్హం. 

ప్రతిపక్ష నేతల కట్టడితో ప్రశాంతత 

రైతునాయకులను తప్ప బిజెపి నాయకులతో సహా, ప్రతిపక్ష నేతలు ఎవ్వరిని అక్కడకు రాకుండా కట్టుదిట్టం చేయడంతో రాజకీయ రంగు పులిమి అవకాశం లేకుండా చేశారు. ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరి వంటి ప్రతిపక్ష నాయకులను అక్కడకు రానిచ్చి ఉంటె వారు రైతులు ప్రభుత్వంతో అవగాహనకు రాకుండా నిరోధించే ఉండేవారు.

వారిని ఎక్కడికక్కడ ఆపివేయడంతో సత్వరం పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడం సాధ్యమైంది. రైతుల ఫిర్యాదుపై మంత్రి అజయ్ మిశ్రా కుమారుడితో సహా, వారి ఆరోపణలు చేసిన వారిపై ఆదివారం రాత్రే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, స్థానికంగా ఆవేశంగా ఉన్న రైతులతో కాకుండా సీనియర్ రైతు నాయకులతో నేరుగా చర్చలు జరపడంతో పరిస్థితులను సద్దుమణిగేటట్లు చేయగలిగారు.

ముఖ్యమంత్రి ఆదేశంపై యూపీ ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ నేరుగా రైతు నాయకులతో సంప్రదింపులు జరిపి మృతుల కుటుంబాలకు భారీ నష్టపరిహారంతో పాటు, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయవిచారణకు ఒప్పుకున్నారు. మృతుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు.

దానితో రైతులు తమ నిరసనను  విరమించుకొని,మృతదేహాలకు శవపరీక్షలు జరపడానికి అంగీకరించడంతో రాజకీయ లబ్ధిపొందాలని చూసిన ప్రతిపక్షాలకు ఆశాభంగం కలిగింది. రాకేష్ తికాయత్ తో సహా రైతు నాయకులు ఎవ్వరిని అక్కడకు రావడాన్ని అడ్డుకోకుండా, వారిని చర్చలకు సిద్ధమయ్యే విధంగా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 

“రైతు నాయకులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పుడు ఎటువంటి సమస్య ఏర్పడలేదు. పైగా, వారికి ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంది. వారితో చర్చించి, వారి డిమాండ్లు అంగీకరించాము” అని ప్రశాంత్ కుమార్ చెప్పారు.