ఒకేసారి ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్స్ సేవ‌ల్లో అంత‌రాయం

సోష‌ల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఏడుగంటలకు పైగా అంతరాయం ఏర్పడింది. యూజ‌ర్లు వాటి సేవ‌లు పొంద‌డంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల నుంచి ఫిర్యాదు చేశారు. 

ఫేస్‌బుక్ ఆధ్వ‌ర్యంలోని ఈ మూడు యాప్స్.. వాట్సాప్.. ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టాగ్రామ్ కొన్ని నిముషాలుగా ప‌ని చేయ‌డం లేద‌ని నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఫేస్‌బుక్ యాజ‌మాన్యం స్పందింస్తూ “అంత‌రాయం క‌లిగినందుకు క్ష‌మించండి.. ఏదో త‌ప్పు దొర్లింది. దాన్ని స‌రి చేయ‌డానికి కృషి చేస్తున్నాం. సాధ్య‌మైనంత త్వ‌రగా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం” అంటూ ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది.

రాత్రి 9 గంట‌లకు ఫేస్‌బుక్ ఆధీనంలోని యాప్స్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు యూజ‌ర్లు ట్విట్ట‌ర్‌లో పోస్టులు పెట్టారు. వెబ్ సేవ‌ల ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్ట‌ర్ డాట్ కామ్‌.. 20 వేల మందికి పైగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌ల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్న‌ట్లు నివేదించార‌ని పేర్కొంది.

తెల్లవారుజామున 4 గంటల తర్వాత గాని అవి పునరుద్ధరణ కాలేదు. భారత్‌లో ఫేస్‌బుక్‌కు 41 కోట్ల మందికి పైగా, వాట్సాప్‌కు 53 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 21 కోట్ల మందికి పైగా యూజ‌ర్లు ఉన్నారు.ఫేస్‌బుక్ కేంద్ర కార్యాలయంలో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల ఇవి నిలిచిపోయినట్లు భావిస్తున్నారు. 

సాంకేతిక కార‌ణాల‌తో వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌లకు  సోమ‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల వ‌ర‌కు అంత‌రాయం క‌లిగించినందుకు చింతిస్తూ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

 ప్ర‌స్తుతం ఈ మూడు నెటిజ‌న్ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు. “మీకు ఇష్ట‌మైన వ్య‌క్తుల‌తో స‌న్నిహితంగా ఉండ‌టానికి వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌పై ఎంత ఆధార‌ప‌డుతారో త‌మ‌కు తెలుసు అని.. ఈ అంత‌రాయం క‌లిగించినందుకు క్ష‌మించండి” అని మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కోరారు.

ఈ అంత‌రాయంపై ట్విట్ట‌ర్ కూడా స్పందించింది. ఈ సంద‌ర్భంగా ట్వీట్ చేసింది. ఈ రోజు వాట్సాప్‌ను ఉప‌యోగించ‌లేక‌పోయిన ప్ర‌తి ఒక్క‌రికీ క్ష‌మాప‌ణ‌లు. వాట్సాప్ మ‌ళ్లీ ప‌ని చేయ‌డం ప్రారంభించింది. మీ స‌హ‌నానికి చాలా ధ‌న్య‌వాదాలు. మీకు మ‌రింత స‌మాచారం ఇచ్చి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తామ‌ని ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డింది.

ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గడంతో.. మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌కు భారీ న‌ష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్‌బుక్‌ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్‌లో డ్యామేజ్‌ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్‌ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది.