చైనా, పాక్ చెరొ వైపు నుంచి దాడి చేసినా ఎదుర్కొంటాం 

 
చైనా, పాకిస్థాన్ చెరొక వైపు నుంచి భారత్‌పై దాడి చేసినా, దీటుగా ఎదుర్కొనేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్)  సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి స్పష్టం చేశారు. చైనా మౌలిక సదుపాయాల పెరుగుదల ప్రభావం భారత దేశ పోరాట సంసిద్ధతపై ఉండబోదని తెలిపారు. చైనా, పాకిస్థాన్ మధ్య భాగస్వామ్యం పట్ల భయపడనక్కర్లేదని భారోసా ఇచ్చారు. 

ఈ నెల 8న భారత వాయు సేన 89వ వార్షికోత్సవాల నేపథ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ  వాయు సేన, సైన్యం, నావికా దళాల సామర్థ్యాలను ఏకీకృతం చేసి, సమన్వయంతో ఉపయోగించుకోవడానికి ఐఏఎఫ్ కట్టుబడి ఉందని తెలిపారు. త్రివిధ దళాల సమష్టి ప్రణాళిక, కార్యకలాపాల నిర్వహణ ఫలితంగా మన నికర పోరాట సామర్థ్యం గరిష్ఠ స్థాయికి పెరుగుతుందని చెప్పారు.

 ప్రతి దళానికి ఉన్న బలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాలు, అపాచీ జెట్స్, కొత్త ఆయుధాలను సమకూర్చడం వల్ల ఐఏఎఫ్‌కుగల దూకుడుగా దాడి చేసే సామర్థ్యం మరింత బలోపేతమైందని తెలిపారు. సైబర్ దాడుల నుంచి భారత దేశ మౌలిక సదుపాయాలను కాపాడటానికి తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు.

చైనా, పాకిస్థాన్ మధ్య భాగస్వామ్యం గురించి భయపడనక్కర్లేదని, వెస్టర్న్ టెక్నాలజీ పాకిస్థాన్ నుంచి చైనాకు వెళ్తుండటం ఒక్కటే ఆందోళనకరమని తెలిపారు. టిబెట్ రీజియన్‌లో మూడు ఎయిర్‌బేస్‌లలో చైనా తన దళాలను మోహరిస్తోందని పేర్కొన్నారు. “వాస్తవ నియంత్రణ రేఖలోని పరిస్థితి ఏమిటంటే, చైనా వైమానిక దళం ఇప్పటికీ ఎల్ ఎ సి వైపు మూడు ఎయిర్ బేస్‌లలో ఉంది. మనం కూడా పూర్తిగా మోహరించి ఎటువంటి పరిష్టితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం” అని వెల్లడించారు.  ”

లడఖ్ సమీపంలోని చైనీస్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాల గురించి అడిగినప్పుడు, బహుళ ఎత్తైన మిషన్లను ప్రారంభించే చైనా సామర్థ్యం బలహీనంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యర్థులపై ఒక  అడుగు ముందుకు ఉండే విధంగా భారత వైమానిక దళం కొత్త పోరాట వ్యవస్థల ప్రక్రియలో ఉందని ఆయన తెలిపారు.