సాగు చట్టాలపై స్టే ఇచ్చాక… ఇంకా నిరసనలేమిటి?

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సేద్యపు చట్టాలపై ఇప్పటికే స్టే ఇచ్చాక కూడా ఇంకా నిరసనలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు రైతు సంఘాలను ప్రశ్నించింది. పైగా, ఈ చట్టాల చెల్లుబాటు గురించి రాజస్థాన్ హైకోర్టు లో సవాల్ చేసిన రైతు సంఘాలు అమలులోనే చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేబట్టవలసిన అవసరం ఏమిటని కూడా నిలదీసింది. ఇది రెండు గుర్రాలపై స్వారీ చేయడమేనని అభిప్రాయపడింది. 
 
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుత ‘సత్యాగ్రహం’ చేపట్టేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైతు సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణను చేపట్టి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యలు చేసింది.
 
విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనను అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టు ముందు ప్రస్తావించారు. కాగా, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవ్వరూ బాధ్యత వహించరని కోర్టు నిరాశ వ్యక్తం చేసింది.  తదుపరి విచారణను అక్టోబర్ 21న చేపడతామని పేర్కొంది.

“మీరు నిరసనకు వెళ్లాలనుకుంటున్నారు. దేనిపై నిరసన? ప్రస్తుతం ఎలాంటి చట్టం లేదు. ఈ కోర్టు దీనిని నిలిపివేసింది. తాము వాటిని అమలు చేయరని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పుడు దేని కోసం నిరసన తెలియజేయాలి” అంటూ కోర్ట్ ప్రశ్నించింది.

“వారు ఒకేసారి రెండు గుర్రాలను స్వారీ చేయలేరు,” అని  అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఒక పార్టీ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనకు ఎక్కడికి వెడతారు అని ఆయన ప్రశ్నించారు. నిరసనను నిలిపివేయాలని అత్యున్నత న్యాయ అధికారి వాదించినప్పుడు, ఆస్తికి నష్టం జరిగినప్పుడు,  భౌతిక నష్టం జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరని బెంచ్ చెప్పింది.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ అంశం అత్యున్నత రాజ్యాంగ న్యాయస్థానం ముందు ఉన్న తర్వాత, అదే సమస్యపై ఎవరూ వీధుల్లో ఉండలేరని స్పష్టం చేశారు. పిటిషనర్ కిసాన్ మహాపంచాయత్ అధ్యక్షుడు తరఫున హాజరైన అడ్వకేట్ అజయ్ చౌదరి మాట్లాడుతూ  పిటిషనర్ ఏ జాతీయ రహదారి వద్ద నిరసనలు జరపడం లేదని, రోడ్డులపై అడ్డంకులు కలిగించడం లేదని తాము కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు.

ఈ చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ రాజస్థాన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, దానిని  సుప్రీంకోర్టుకు బదిలీ చేసి, దీనితో పాటు ,ఈ అంశాన్ని కూడా విచారించవచ్చని బెంచ్ తెలిపింది. రాజస్థాన్ హైకోర్టు నుండి ఆ  రిట్ టిషన్ రికార్డును వెంటనే  తెప్పించి, ప్రస్తుత రిట్ పిటిషన్‌తో పాటు విచారణకు బదిలీ చేసిన కేసుగా నమోదు చేయడానికి వెంటనే రిజిస్ట్రీని ఆదేశించారు.