జావేద్‌ అక్తర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌పై ముంబై పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించిన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముంబైకి చెందిన న్యాయవాది సంతోష్ దూబే ఫిర్యాదు మేరకు ములుంద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 

ఈ సందర్భంగా సంతోష్‌ దూబే మాట్లాడుతూ ఇంతకు ముందు జావేద్‌ అక్తర్‌కు లీగల్‌ నోటీసు పంపానని, ఇందులో వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోరినట్లు తెలిపారు. అయితే, నోటీసుకు ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 

ఐపీసీ సెక్షన్‌ 500 కింద పరువు నష్టం కేసు నమోదు చేసినట్లు ములుంద్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఓ వార్తకు సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్‌ అక్తర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ఐ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ‘తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్‌ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ పని చేస్తోంది’ ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. బీజేపీతో పాటు శివసేన సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే అక్తర్‌ వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం దావాపై షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని థానే కోర్టు గతంలో ఆదేశించింది. అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌, జాయింట్‌ సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) కోర్టులో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వివేక్‌ చంపనేర్కర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.