నీట్ ర‌ద్దు పిటీషన్ కొట్టివేత

ఈ ఏడాది మ‌ళ్లీ నీట్‌-యూజీ 2021 ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని జాతీయ విద్యా సంస్థ (ఎన్టీఏ)ను ఆదేశించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు సోమ‌వారం కొట్టి పారేసింది. నీట్‌-యూజీ 2021 ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తే ల‌క్ష‌ల మంది విద్యార్థుల భ‌విష్య‌త్ దెబ్బ తింటుంద‌ని జ‌స్టిస్‌లు ఎల్ఎన్ రావు, బీఆర్ గ‌వాయిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం పేర్కొంది. 

ఎంబీబీఎస్‌, బీడీఎస్ త‌దిత‌ర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య‌విద్యా కోర్సుల్లో ప్ర‌వేశానికి ప్ర‌తియేటా నీట్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోమారు ఇటువంటి పిటిష‌న్ దాఖ‌లు చేస్తే జ‌రిమానా విధిస్తామ‌ని ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించింది. 

ఎంబీబీఎస్ విద్యాభ్యాసం చేయాల‌ని భావిస్తున్న విద్యార్థులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో ఈ ఏడాది నీట్ యూజీ 2021లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, పేప‌ర్‌లీకేజ్ అయ్యింద‌ని పేర్కొన్నారు. పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో సంబంధం ఉన్న కోచింగ్ సెంట‌ర్ల తీరుపై సీబీఐ కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ద‌ని గుర్తు చేశారు. నీట్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌కుండా స్టే విధించాల‌ని కూడా పిటిష‌నర్లు 

కేవ‌లం ఐదు కేసుల కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా 7.5 ల‌క్ష‌ల మంది విద్యార్థులు రాసిన ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాలా? అని ధర్మాసనం  ప్ర‌శ్నించింది. అలా ప‌రీక్ష ర‌ద్దు చేయ‌డం సాధ్యం కాద‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఇటువంటి పిటిష‌న్లు దాఖ‌లు చేసినందుకు పిటిష‌న‌ర్ల‌పై తొలుత రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తామ‌ని ప్ర‌తిపాదించింది. త‌ర్వాత ఇప్ప‌టికైతే హెచ్చ‌రిక‌ల‌తో వ‌దిలేస్తున్నామ‌ని, మ‌రోసారి ఇటువంటి పిటిష‌న్లు దాఖ‌లు చేస్తే మాత్రం జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చ‌రించింది.

కాగా,  వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)ను వ్యతిరేకిద్దామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 12 రాష్ట్రాలముఖ్యమంత్రులకు వ్రాసిన లేఖలో పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా విద్యా రంగంపై రాష్ట్రాల ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి రాష్ట్రాల ఐక్యతను కూడగట్టేందుకు ఆయన ప్రయత్నించారు.

బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌తో పాటు గోవా సీఎంలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. డీఎంకే ఎంపీల బృందం ఈ లేఖలను ఆయా రాష్ట్రాల సీఎంలను కలిసి అందజేయనున్నారు.