బిసి లకు తిరుమలలో బ్రహ్మోత్సవ దర్శనం 

ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాల నుంచి సుమారు రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుక‌బ‌డిన వ‌ర్గాల భ‌క్తుల‌కు అక్టోబ‌రు 7 నుంచి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్రహ్సోత్సవ దర్శనం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది. వీరికి తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి దర్శనం చేయిస్తారు.

హిందూ ధ‌ర్మాన్ని ప్రచారం చేసేందుకు, మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ‌ ద్వారా స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ సహకారంతో టీటీడీ మొద‌టి విడ‌త‌లో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆల‌యాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల నుంచి బ్రహ్సోత్సవాల స‌మ‌యంలో భ‌క్తుల‌ను ఆహ్వానించి శ్రీ‌వారి ద‌ర్శనం చేయించ‌డం జ‌రుగుతుంది.

ఒక్కో జిల్లా నుంచి 10 బ‌స్సులు ఏర్పాటుచేసి భ‌క్తుల‌ను ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకొస్తారు. తూర్పుగోదావ‌రి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో 20 బ‌స్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బ‌స్సులో ఇద్దరు స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు మార్గమధ్యంలో స్థానిక దాతల స‌హ‌కారంతో ఆహార పానీయాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది.

కొవిడ్ సర్టిఫికెట్ తనిఖీ

సామాన్య భక్తులకు సైతం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కల్పించేందుకు సర్వదర్శనం టికెట్ల కోటాను పునరుద్ధరించగా, టిటిడి ఇటీవల ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు భక్తులు టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సోమవారం పలు సూచనలు చేసింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. కొవిడ్‌ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేష‌న్ సర్టిఫికెట్‌ లేదంటే.,  దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

పలువురు భక్తులకు దర్శనం టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద సిబ్బంది తనిఖీ చేసి దర్శనం టోకెన్లు, టికెట్లు లేని భక్తులను వెనక్కి పంపుతున్నారు. ఈ క్రమంలో భక్తులు గమనించి, సహకరించాలని టీటీడీ కోరింది. భక్తులకు వ్యాక్సినేష‌న్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నవారికే అనుమతి ఇవ్వనున్నారు. అలిపిరి దగ్గర టీటీడీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. 18 ఏళ్ల లోపు వారికి టీటీడీ నిబంధనలు వర్తించనున్నాయి.