అవిశ్వాసంలో ఓడిపోయిన కాకినాడ మేయర్‌ పావని

కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్‌ సుంకర పావని, ఉప మేయర్‌-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. 
 
కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌లో 44 మంది కార్పొరేటర్లు ఉండగా, మరో ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి నేపథ్యంలో సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. దీంతో మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకున్నట్లయ్యింది.
 
ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు. అయితే కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్‌ అధికారి రిజర్వ్‌ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలనుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.2017లో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 32 టీడీపీ, 10 వైసీపీ, 03 బీజేపీ, 03 ఇండిపెండెంట్లు గెలుపొందారు. అప్పట్లో ఇండిపెండెంట్‌లు అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
అయితే మేయర్‌ వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఈ పరిణామాలు తారస్థాయికి చేరి మొత్తం టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు దూరమయ్యారు. తదనంతరం అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో కాకినాడలో రాజకీయ సమీకరణలు మారాయి.
 
ఇదిలా ఉండగా టీడీపీలో గెలిచి ఆ పార్టీ ఓటమి పాలైన వెంటనే అధికార పార్టీతో చేతులు కలిపిన ఘటనలే.. మేయర్‌ను ఒంటరిని చేశాయనే కోణంలో చర్చ సాగింది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మేయర్‌పై అసంతృప్తితో ఉన్న టిడిపి కార్పొరేటర్లంతా వైసిపి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి వర్గంగా ఏర్పడడంతో మేయర్‌ మార్పుపై గురిపెట్టారు. 
 
ప్రస్తుతం ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలోని టీడీపీ కార్పొరేటర్లు.. మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస సమావేశం ఏర్పాటుచేయాలంటూ కలెక్టర్‌ను కోరడంతో అవిశ్వాస తీర్మాన సమావేశం పెట్టారు.