ఏపీలో లక్ష ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతం

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో వివక్షతకు, నిర్లక్ష్యానికి, దాడులకు గురవుతున్న హిందూ దేవాలయాల భూములకు సహితం రక్షణ లేకుండా పోతున్నది. ఇప్పటికే లక్షకు పైగా ఎకరాలు అన్యాక్రాంతంలో ఉండగా, వాటిని స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలు చేయకుండా, స్వయంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర పలుకుబడి గలవారు నిర్లజ్జగా దేవాలయ భూములను ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

దేవాలయ భూములను కైవసం చేసుకోవడం కోసం నిబంధనలను తుంగలో తోక్కమని అధికారులపై వత్తిడి తెస్తున్నారు. అందుకోసం ఆయా భూములకు సంబంధించి `అభ్యంతరం లేదు’ అంటూ పత్రాలు జారీచేయమని బలవంతం చేస్తున్నారు. భూములను కాపాడవలసిన దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాజీ ఓఎస్డి అత్యుత్సాహం ప్రదర్శించి ఈ విషయమై వివాదాలకు గురయ్యారు.

తాజాగా గుడివాడలో రెండు ఆలయాలకు చెందిన రూ.250 కోట్ల విలువైన భూములపై ఓ మంత్రి కన్నేసిన్నట్లు ఆరోపణలు చెలరేగాయి. మరోవైపు ప్రజాప్రయోజనం పేరుతో పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వమే ఆలయాల భూములు కైవసం చేసుకొంటున్నది. స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. దేవుడి భూములకు వివిధ ప్రభుత్వ శాఖలు రూ.991 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఇంకోవైపు సాగు పేరుతో, ఇతర అవసరాల కోసం లీజుపై దేవుడి భూములు తీసుకున్న వేలాది మంది కౌలుదారులు గడువు ముగిసినా అక్కడే తిష్టవేసి భూములను తమ గుప్పిట్లోనే ఉంచుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారమే రాష్ట్ర దేవదాయశాఖ పరిధిలోని 23,778 ఆలయాలకు మొత్తం 4,09,229 ఎకరాల భూములను దాతలు విరాళంగా ఇచ్చారు. అందులో 1,51,297 ఎకరాల సాగు భూములు లీజులో   ఉన్నాయి. 1,01,027 ఎకరాలను అర్చకులు సాగు చేసుకుంటున్నారు. కొండ ప్రాంతాల్లో సాగుకు అనువుగా లేని భూములు 19,995 ఎకరాలు, ఆలయాలు, సత్రాల పరిధిలో 25,117 ఎకరాలు ఉన్నాయి. 

కాగా, ప్రజాప్రయోజనాల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు 6,429 ఎకరాలను లీజుకు తీసుకోగా, వాటికి పరిహారం మాత్రం చెల్లించడం లేదు. ఇక 87,525 ఎకరాలు పూర్తిగా ఆక్రమణలో ఉండిపోయాయి. గతంలో లీజుకు తీసుకుని గడువు ముగిసినా వాటిని ఆలయాలకు తిరిగి అప్పగించని భూములు 25,117 ఎకరాలున్నట్లు దేవదాయశాఖ గుర్తించింది. 

ఈ రెండు కేటగిరీలు కలిపి 1,05,364 ఎకరాలు ఆలయాల పరిధిలో లేకుండా అక్రమార్కుల చేతిలో మిగిలిపోయాయి. ఆక్రమణలకు సంబంధించి 3,561 కేసులు దేవదాయశాఖ ట్రైబ్యునల్‌లో విచారణలో ఉన్నాయి.

గత ప్రభుత్వంలో ఆక్రమణల నుంచి భూములను విడిపించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలోనే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి అనుమానం ఉన్న భూముల క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా దేవుడి భూముల జాబితాలో చేర్చారు. అందులో కచ్చితంగా దేవుడి భూములే అని నిర్ధారణ అయిన వాటిని రిజిస్ర్టేషన్‌ నిషేధిత జాబితాలో చేరుస్తున్నారు. 

కానీ, వైసీపీ ప్రభుత్వంలో ఆలయ భూముల పరిరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రెండున్నరేళ్లు గడిచినా అసలు దేవుడి భూములు ఏ స్థితిలో ఉన్నాయని  పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదు.