బద్వేల్‌ లో పోటీకి టీడీపీ దూరం… బిజెపి సై

కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. టీడీపీ పొలిట్‌బ్యూరో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దానితో అధికార పక్షం వైసీపీతో బిజెపి నేరుగా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బద్వేలు ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజశేఖర్‌, విజయమ్మ ఇతర టీడీపీ నాయకులతో మాట్లాడాక నిర్ణయం ప్రకటించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో భావించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని నెలకొల్పింది టీడీపీయేనని పొలిట్‌బ్యూరో గుర్తు చేసింది.
నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించలేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. బద్వేలులో మరణించిన కుటుంబానికే టికెట్‌ ఇవ్వడంతో పోటీ అంశంపై చర్చించిన నాయకులు పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిర్ణయం ప్రకటించే ముందు బద్వేల్‌ నాయకులతో మాట్లాడాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు.

మరో వైపు
దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య డా సుధ పోటీచేస్తున్నందున ఆమెపై గౌరవంతో అక్కడ జనసేన పోటీచేయడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే ప్రకటించా. అయితే మిత్రపక్షం నిర్ణయంతో నిమిత్తం లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని స్థానిక బీజేపీ నేతలు తమ నాయకత్వానికి స్పష్టం చేశారు
 
బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో ఇక్కడ ఉఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉప ఎన్నిక, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.  
 
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైతం పోటీచేయూడదని నిర్ణయించడంతో ఏకగ్రీవం అవుతుందనుకున్నారు. అయితే బీజేపీ ప్రకటనతో పోలింగ్‌ అనివార్యంగా మారింది. రాష్ట్ర బీజేపీ నేతలు ఆదివారం కడపలో సమావేశమై  పోటీచేయాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని 70 పంచాయతీలకు ఎన్నికల ఇన్‌చార్జులను నియమించాలని కూడా నిర్ణయించారు. 
 
 ప్రతి ఇంటికీ వెళ్లి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించాలని నిశ్చయించారు. కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని.. ప్రతి గ్రామానికి పది మంది కార్యకర్తలను పంపించి జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులు, రోడ్ల దుస్థితి, ఇతరత్రా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వివరించేందుకు ప్రణాళిక రచించారు.
 
పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జయరాములు, 2014లో టీడీపీ అభ్యర్థిగా ఓటమి పాలైన విజయజ్యోతి, అట్లూరు మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌ నరసింహులు, ప్రభుత్వ రిటైర్డ్‌ వైద్యుడు రాజశేఖర్‌ లతో ఒక జాబితాను కేంద్ర నాయకత్వంకు పంపారు. వారిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది.