నోటీసు ఇవ్వకుండా ఫించన్ రద్దు చెల్లదు 

ఎటువంటి నోటీసు, విచారణ లేకుండా సామాజిక భద్రత ఫించన్లను రద్దు చేయడం చెల్లదని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. తమకు సామాజిక భద్రత ఫించనున్న నిలిపేయడాన్ని, అర్హతలున్నా ఫించను ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ బి. దేవానంద్‌ ఆ మేరకు తీర్పు ఇచ్చారు. 

ఒకసారి అర్హత నిర్ణయించి ఫించను మంజూరు చేసిన తరువాత ఎలాం టి విచారణ లేకుండా ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. కొందరు అధికారులు తీసుకుంటున్న ఈ తరహా చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం లక్ష్యం నెరవేరడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

అర్హత ఉన్నా సామాజిక పెన్షన్లు మంజూరు చేయకపోవడం, గతంలో పెన్షన్‌ పొందుతున్న లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వకుండా రాజకీయ కారణాలతో అర్ధాంతరంగా నిలిపివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.ఇటువంటి చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్దమని, ఏకపక్షమని పేర్కొన్నారు. 

ధృవీకరణ పత్రాలు సరైనవి కావని భావిస్తే వాటిని జారీ చేసిన అధికారులపై మొదట విచారణ జరపాలని సూచించారు. నోటీసు ఇచ్చి, విచారణ తర్వాత పింఛన్లను నిలిపివేసే అధికారం అధికారులకు ఉందని స్పష్టం చేశారు. పెన్షన్‌ తొలగింపు విషయంలో నిర్ణయం తీసుకోవాలని, కానీ ఎలాంటి విచారణ లేకుండా గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది ఇచ్చిన నివేదిక ఆధారంగా పెన్షన్‌ చెల్లింపు నిలిపివేస్తున్నారని పేర్కొంది. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. 

ప్రజాధనం విషయంలో ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించాలని, రాజకీయ కారణాలతో వివక్ష చూపకుండా నిష్పాక్షికంగా, సహేతుకంగా ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్ల విషయంలో పెన్షన్లు నిలిపివేసిన నెల నుంచి నేటివరకు తక్షణం చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించింది.