బద్వేల్ ఉపఎన్నికలో పోటీకి బిజెపి సిద్ధం 

కడప జిల్లా బద్వేల్ లో ఈ నెల 30న జరుగనున్న ఉపఎన్నికలో తమ అభ్యర్థి పోటీ చేయాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతగా ఆసక్తి చూపించక పోయినా, కేంద్ర నాయకత్వం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తున్నది. 

ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ అభ్యర్థిగా డాక్టరు ఓబులాపురం రాజశేఖర్‌, వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టరు దాసరి సుధాను ప్రకటించారు. మూడు రోజుల క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్  కళ్యాణ్, ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ లతో ఈ ఉపఎన్నిక విషయమై సమాలోచనలు జరిపారు.

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి పోటీ చేసిన దృష్ట్యా, ఇక్కడ జనసేన పోటీ చేయాలి అనుకొంటున్నట్లు ఈ సందర్భంగా వార్తలు వచ్చాయి. అయితే ఎమ్మెల్యే మరణంతో ఆయన సతీమణికే వైసీపీ టికెట్ ఇవ్వటంతో తాము పోటీ చేయబోమని పవన్ కళ్యాణ్ శనివారం బహిరంగసభ వేదిక నుండే ప్రకటించారు. 

 పార్టీ అధిష్ఠానం ఆదేశంపై ఇవాళ కడప జిల్లాలో బీజేపీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం పోటీపై బీజేపీ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్లతో సంబంధం లేకుండా పార్టీ ఎన్నికల గుర్తు ప్రతి ఎన్నికలో కనిపించి, ప్రజలకు చేరువ కావాలని, క్రమంగా ఓట్ల శాతం పెంచుకునేందుకు కృషి చేయాలని బిజెపి కేంద్ర నాయకత్వం భావిస్తున్నది. ‘ఎన్ని ఓట్లు వస్తాయన్నది ముఖ్యం కాదు.. ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్లాల్సిందే.. బ్యాలెట్‌లో మన పార్టీ గుర్తు కనిపించాల్సిందే’ అని కేంద్ర నాయకత్వం స్పష్టం చేసిన్నట్లు చెబుతున్నారు.