మ‌హాత్ముడికి రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ఘననివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ, దేశ రెండో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు.. వారి స‌మాధుల వ‌ద్ద నివాళుల‌ర్పించారు. రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌ వద్ద రామ్‌నాథ్ కోవింద్, మోదీ, సోనియా గాంధీ.. పుష్పాంజ‌లి ఘ‌టించారు.

ప్రధాని మోదీ మహాత్ముడికి ఘన నివాళులు అర్పిస్తూ బాపు జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి మంచి మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని కొనియాడారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ప్రపంచం అనుసరించదగినవని, అవి లక్షలాది మందిని బలోపేతం చేస్తాయని చెప్పారు.  

మోదీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, జాతి పిత మహాత్మా గాంధీకి ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా తాను గౌరవనీయ గాంధీజీకి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. 

పూజ్య బాపూ జీవితం, ఆదర్శాలు మన దేశంలోని ప్రతి తరాన్ని ప్రేరేపిస్తాయని, కర్తవ్య మార్గంలో నడిచే విధంగా ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలు ప్రపంచం అనుసరించదగినవని, అవి లక్షలాది మందికి బలాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. 

మ‌హాత్మాగాంధీ 152వ జ‌యంతి, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి 117వ జ‌యంతి ఉత్స‌వాల్లో ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం ప్ర‌కాశ్ బిర్లా, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రీ కుమారుడు అనిల్ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గాంధీ, శాస్త్రి సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు.