గడ్కరీని పొగడ్తల్లో ముంచెత్తిన పవార్

కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పొగడ్తలతో ముంచెత్తారు. అధికారాన్ని ఎలా ఉపయోగించవచ్చో అన్నది ఆయన చూపించారని ప్రశంసించారు. మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ మధ్య వైరం ఉన్నప్పటికీ, అహ్మద్ నగర్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ, శరద్‌ పవార్‌ ఒకే వేదికను పంచుకున్నారు.

‘నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఎందుకంటే, అహ్మద్‌నగర్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించే అనేక ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించబోతున్నట్లు నాకు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గోవాలని ఆయన కోరారు’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. 

శిలాఫలకాలు ఏర్పాటు చేయడంలాంటివి చాలా చూస్తాం.. కానీ, పనులు మాత్రం జరగవని చెబుతూ సాధారణంగా ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన అనంతరం చాలా కాలం వరకు పనులు మొదలుకావని ఆయన గుర్తు చేశారు.  అయితే నితిన్‌ గడ్కరీ ప్రాజెక్టు పనులు కొన్ని రోజుల్లోనే మొదలుకావడంతోపాటు అనుకున్న సమయంలోపు పూర్తవుతాయని మాజీ ఉపప్రధాని అభినందించారు.

దేశ అభివృద్ధి కోసం ఎలా పని చేయాలో అన్నదానికి ప్రజాప్రతినిధి అయిన గడ్కరీ నిదర్శనమని ఆయన కొనియాడారు. రోడ్డు రవాణా శాఖను గడ్కరీ చేపట్టక ముందు ఐదు వేల కిలోమీటర్ల రహదారుల్లో పనులు జరుగ్గా, ఆయన హయాంలో ఈ సంఖ్య 12,000 కిలోమీటర్లు దాటిందని తెలిపారు.

కాగా, అహ్మద్‌నగర్ జిల్లాలో నీటి సంరక్షణపై దృష్టి సారించాలని వేదికపైనున్న ఎన్సీపీకి చెందిన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్‌కు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ప్రవాహాలు, చెరువుల లోతును పెంచడం వల్ల భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు దోహదపడుతుందని చెప్పారు.