సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల నయవంచన 

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు రాజకీయ నయవంచనకు పాల్పడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి మేధోపరమైన నిజాయితీ కొరవడిందని దుయ్యబట్టారు. ప్రజలు దశాబ్దాల క్రితం పొందవలసిన ప్రయోజనాలను ఇప్పుడు అందజేసేందుకు కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. 

ఓపెన్ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసి, వాటిని నెరవేర్చకపోవడం ఒక తరహా అని చెప్పారు.  అయితే ముఖ్యంగా అవాంఛనీయమైనది, అసహ్యకరమైనది ఏమిటంటే, తన ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల తరహాలోనే కొన్ని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేశాయని గుర్తు చేశారు. అవే పార్టీలు ఇప్పుడు యూ-టర్న్ తీసుకున్నాయని ధ్వజమెత్తారు. ఆ పార్టీలు చేసిన వాగ్దానాలపై హానికరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నాయని విమర్శించారు.

తమకు అర్హతగల, దశాబ్దాల క్రితం పొందవలసిన ప్రయోజనాలను భారతీయులు ఇప్పటికీ పొందలేకపోతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశం, ప్రజలకు అర్హత గల వాటి కోసం ఇంకా ఎదురు చూడవలసిన పరిస్థితిలో దేశాన్ని ఉంచకూడదని ప్రధాని స్పష్టం చేశారు. వాటిని వారికి ఇవ్వాలని, దీని కోసం భారీ నిర్ణయాలను తీసుకోవాలని చెబుతూ  అవసరమైతే కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవాలని తేల్చి చెప్పారు. 

కొత్త సాగు చట్టాల్లో ఫలానా అంశాన్ని మార్చాలని నిర్దిష్టంగా ఎవరూ చెప్పడం లేదని ప్రధాని గుర్తు చేశారు. భారత దేశంలో రాజకీయాలు కేవలం ఒక విధానాన్నే చూస్తున్నాయని అంటూ తదుపరి ప్రభుత్వాన్ని కూడా తామే నడపాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. కానీ తన మౌలిక ఆలోచన దీనికి భిన్నమైనదని చెప్పారు.

 దేశాన్ని నిర్మించడానికే ప్రభుత్వాన్ని నడపాలనేదానిని తాను నమ్ముతున్నానని చెప్పారు. ‘‘మీ పార్టీని గెలిపించుకోవడానికి ప్రభుత్వాన్ని నడిపే సంప్రదాయం ఉండేది. కానీ దేశాన్ని గెలిపించే విధంగా ప్రభుత్వాన్ని నడపాలనేది నా ఉద్దేశం’’ అని మోదీ తెలిపారు. కొత్త సాగు చట్టాల అమలును ప్రస్తుతం నిలిపేశారు. ఈ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర విధానాన్ని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో గత ఏడాది నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

టీకాలు, పడకల కొరత విమర్శలు మాత్రమే 

 దేశ ప్ర‌జ‌ల‌కు కోవిడ్ టీకాలు ఇవ్వ‌డంలో అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. భార‌త్ ఆత్మ‌నిర్భ‌ర్‌గా మారింద‌ని, స్వ‌యం స‌మృద్ధిగా ఎదిగింద‌ని చెప్పారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ విజయవంతం కావ‌డంలో టెక్నాల‌జీ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ఇక కోవిడ్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో టీకాలు, పడకల కొర‌త ఉన్నట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను మోదీ కొట్టిపారేశారు. అవి కేవ‌లం విమ‌ర్శ‌లు మాత్ర‌మే అని స్పష్టం చేశారు.  ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఉన్న వ‌యోజ‌న జ‌నాభాలో 69 శాతం మంది క‌నీసం ఒక డోసు అయిన టీకా తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 25 శాతం మంది మాత్రం రెండు డోసుల టీకాలు తీసుకున్న‌ట్లు చెప్పారు.

ఇదే రీతిలో డిసెంబ‌ర్ చివ‌రి క‌ల్లా యావ‌త్ దేశాన్ని వ్యాక్సినేట్ చేయ‌నున్న‌ట్లు ప్రధాని  చెప్పారు. ఒక‌వేళ మ‌న దేశం వ్యాక్సిన్ త‌యారు చేయ‌లేద‌నుకుంటే, అప్పుడు మ‌రి ప‌రిస్థితి ఏవిధంగా ఉండేదని ప్రధాని ప్రశ్నించారు.  ఇప్ప‌టికీ కోవిడ్ వ్యాక్సిన్ అంద‌ని దేశాలు ఉన్నాయ‌ని ఆయన గుర్తు చేశారు. భార‌త్ ఆత్మ‌నిర్భ‌ర్ కావ‌డం వ‌ల్లే వ్యాక్సినేష‌న్‌లో విజయం  సాధించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. జై జ‌వాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్ మంత్రాన్ని జ‌పించిన‌ట్లు చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ప‌రిశోధ‌న‌ల‌కు పెద్ద పీట వేస్తుంద‌ని తెలిపారు.

విమ‌ర్శ‌లు వేరు, ఆరోప‌ణ‌లు వేర‌ని చెబుతూ చాలా వ‌ర‌కు జ‌నం ఎక్కువ‌గా ఆరోప‌ణ‌లు మాత్ర‌మే చేస్తార‌ని, కానీ విమ‌ర్శ‌లు చేయాలంటే, లోతైన అధ్య‌య‌నం, హార్డ్‌వ‌ర్క్ అవ‌స‌ర‌మ‌ని ప్రధాని హితవు చెప్పారు. కొన్ని సంద‌ర్భాల్లో తాను విమ‌ర్శ‌కుల‌ను మిస్ అవుతుంటాన‌ని తెలిపారు. వ్యాక్సిన్ డ్రైవ్ స‌క్సెస్ అంశంలో లాజిస్టిక్స్‌, ప్లానింగ్ లాంటి అంశాల‌ను ప‌రిశీలించాల‌ని, దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టామ‌ని, ప్ర‌పంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేష‌న్ డ్రైవ్ జ‌రుగుతోంద‌ని, దాన్ని మీడియా హైలెట్ చేస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

“నిజాయితీతో, మ‌ర్యాద‌పూర్వ‌కంగా చెబుతున్నాను, విమ‌ర్శ‌కుల‌ను చాలా గౌర‌విస్తాను, కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు విమ‌ర్శ‌కులు త‌క్కువే ఉన్నారు” అంటూ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. చాలా వ‌ర‌కు జ‌నం కేవ‌లం ఆరోప‌ణ‌లు మాత్ర‌మే చేస్తార‌ని, వాళ్ల ఆలోచ‌నాస‌ర‌ళితో మాత్ర‌మే గేమ్స్ ఆడే ప్ర‌య‌త్నం చేస్తార‌ని ధ్వజమెత్తారు.