యుపి ఒడిఒపి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగనా రనౌత్‌

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ (వన్‌ డిస్ట్రిక్‌-వన్‌ ప్రొడక్ట్‌ (ఒడిఒపి))’ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అధికారిక నివాసంలో కంగనా కలిశారు. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో ఉత్పత్తి-నిర్థిష్ట సాంప్రదాయ పారిశ్రామిక హబ్‌లను సృష్టించే లక్ష్యంతో ఒడిఒపి కార్యక్రమాన్ని యుపి ప్రభుత్వం తీసుకువచ్చింది.

‘ప్రముఖ నటి కంగనా రనౌత్‌… యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఒడిఒపి ఉత్పత్తిని అందజేశారు. ఒడిఒపి కార్యక్రమానికి ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు’ అదనపు ప్రధాన కార్యదర్శి  (సమాచార) నవనీత్‌ సెఘాల్‌ ట్వీట్‌ చేశారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ సందర్భంగా.. ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందంటూ కంగనా మెచ్చుకున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు.

ఈ సందర్భంగా అయోధ్య సందర్శించాలని కంగనాను యోగి కోరుతూ ఆమెకు  అరుదైన బహుమతి ఇచ్చారు. అయోధ్యలోని రామమందిర భూమి పూజలో ఉపయోగించిన శ్రీరామచంద్రుని నాణాన్ని బహుమతిగా అందజేశారు. సీఎం యోగి బహుమతిగా ఇచ్చిన రామచంద్రుడి నాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న కంగనా ‘‘నాడు శ్రీరామచంద్రుడి లాగా నేడు తపస్వీ యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్నారని, మహారాజ్ పాలనను కొనసాగించనివ్వండి’’ అంటూ  వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం కంగనా సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ‘తేజస్‌’లో కంగనా ఐఏఎఫ్ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తోంది. ‘ఢాకాడ్’, ‘మణికర్ణిక రిటర్న్స్’, ‘సీత: ది ఇన్‌కార్నేషన్‌’ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.మొరాదాబాద్ నగరంలో తేజస్ చిత్రం షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత  సినీ నటి కంగనా ఉత్తర ప్రదేశ్ రాజధాని నగరమైన లక్నోకు వచ్చి సీఎం యోగిని కలిశారు.

తన చిత్ర బృందానికి సహాయం చేసినందుకుగాను ఆమె యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి యోగితో దిగిన ఛాయాచిత్రాలను పంచుకుంది. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2022 లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు కంగనా పేర్కొంది.