హుజూరాబాద్‌లో బిజెపి గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మార్పు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీకి గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మారుతుందని, ఫౌంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ రోడ్డు మీదకు వస్తారని మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగారం, నగురం, వావిలాల, పాపక్కపల్లి, గోపాల్‌పూర్‌లలో శుక్రవారం ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.

‘నాది రేశంగల పుట్టుక. దళితబంధు వద్దు అని నేను, కాళ్లు మొక్కుతా బాంఛన్‌ అని లేఖ రాస్తానా? టీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశాల మేరకు కొంతమంది ఫేక్‌గాళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కేసీఆర్‌కు జాతి, నీతి, మానవత్వం లేదు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌ ధర్మంతో ఆడుకుంటున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు. ప్రజలకు ఏ పథకం కావాలన్నా ఇంటి మీద టీఆర్‌ఎస్‌ జెండా ఉండాలని బెదిరింపులకు గురిచేస్తున్నారని, మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు వస్తున్నాయని, కానీ పెన్షన్ల మీద ఖర్చు పెట్టేది కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌కు తెలంగాణగడ్డపై పుట్టగతులు ఉండవని, 2023లో పార్టీ పతనం ఖాయమని ఈటల రాజేందర్‌ భరోసా వ్యక్తం చేశారు. 30న జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్‌ ఆ దిశగా సంకేతం ఇవ్వబోతోందని జోస్యం చెప్పారు.

జమ్మికుంటలోనిర్వహించిన వడ్డెర సంఘం సమావేశంలో మాట్లాడుతూ వడ్డెర కులస్తులను టీఆర్‌ఎస్‌లో చేరకుంటే జేసీబీలు, ట్రాక్టర్లు నడవనీయమని, వృత్తి చేసుకోబోనివ్వమని బెదిరించినట్లు తనదృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకు ఓట్లతో సమాధానం చెప్పాలని సూచించారు. 18 ఏళ్లు హుజూరాబాద్‌ నాయకుడిగా సమర్థవంతమైన పాలన అందించానని తెలిపారు.

‘బండ కొట్టుకునే వడ్డెరులను అటవీ అధికారులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. రూ.5 కోట్ల విలువైన పనుల్లో ఈఎండీ లేకుండా కాంట్రాక్టులు ఇవ్వాలి. వడ్డెరలకు, ఇతర సంచార జాతులకు, పేదలందరికీ దళితబంధులాంటి పథకం వర్తింపజేయాలి. టీఆర్‌ఎస్‌ మీటింగుల్లో పసలేదని, నేను ప్రచారానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను రాజీనామా చేస్తేనే హుజూరాబాద్‌లో పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు.