మోదీ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

కష్టజీవి అయిన ప్రధాని మోడీ చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందని బీజేపీ నేత, మాజీ ఎంపీ జి  వివేక్ వెంకటస్వామి సూచించారు. ఒక సామాన్య వ్యక్తి నుంచి ప్రధాన మంత్రి హోదాకు చేరుకున్నారంటే అది ఆయన కృషి, పట్టుదల వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు. 

భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ  విజయాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. 

‘దేశానికి మంచి చేయాలని ఆర్ఎస్ఎస్ లో పనిచేసి, రెండుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజలకు మోదీ  చేసిన పథకాలను ఒక పాఠంలాగా ప్రజలకు తెలియచేయాలి. ఒక ఛాయ్ వాలా నుంచి ప్రధాన మంత్రి హోదాకు ఎదిగి  ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో మోదీ ఉన్నారు’ అని చెప్పారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాలు పనిచేసి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని చెబుతూ ప్రధానిగా ప్రజలకు ఉపయోగపడేలా ప్రాజెక్టులు నిర్మించారని, యువతకు ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. 

భారతదేశాన్ని అన్ని విధాలుగా ముందు వరుసలో ఉంచారని చెబుతూ 70 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించారని వివేక్ కొనియాడారు. వ్యాక్సినేషన్ ప్లెక్సీల్లో మోదీ  ఫొటో పెట్టి అవగాహన కల్పించాలని అయన సూచించారు. 80 కోట్ల మందికి 10 కిలోల బియ్యం, పప్పు, నూనె సామాగ్రిలను అందించారని చెప్పారు.