`అకాడమీ’ డిపాజిట్ల గల్లంతులో నలుగురు అరెస్టు… డైరెక్టర్ పై వేటు 

తెలుగు అకాడమీలో నిధులు గల్లంతైన వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు  మొత్తం నలుగురిని అరెస్ట్ చేసారు. అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతి, యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీ, ఎపి మర్కంటైల్ సహకార సంఘం ఉద్యోగి మొయినుద్దీన్‌ను ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేయగా తాజాగా ఎపి మర్కంటైల్ సహకార సంఘం ఛైర్మన్ సత్యనారాయణను సైతం అరెస్ట్ చేశారు. 

ఈ నలుగురు నిందితులను శుక్రవారం నాడు సిసిఎస్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అకాడమీకి చెందిన రూ.60 కోట్ల ఎఫ్‌డిలు దారి మళ్లించినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలతో మర్కంటైల్ సహకార సంఘంలో ఖాతాలు సృష్టించి నిధులు మళ్లించారని, ఇందుకు సహకార సంఘం ఉద్యోగులు సహకరించినట్లు పోలీసులు తేల్చారు.

మరోవంక, తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు పడింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేనకు తెలంగాణ ప్రభుత్వం అకాడమీ బాధ్యతలు అప్పగించింది.  తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్ పై నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. ఇంటర్‌బోర్డు కార్యదర్శి, బోర్డులోని అకౌంట్స్ అధికారి, కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు ఇందులో సభ్యులుగా నియమించింది. 

తెలుగు అకాడమీకి మొత్తం 11 బ్యాంకుల్లో 34 ఖాతాలు ఉన్నాయి. అయితే పలు బ్యాంకుల్లో రూ 330 కోట్లను తెలుగు అకాడమీ డిపాజిట్‌ చేసింది. ప్రధానంగా యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటిలో కెనరా బ్యాంకు చందానగర్ బ్రాంచ్ నుంచి డిపాజిట్ విత్‌డ్రా అవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అలాగే యూనియన్ బ్యాంకులోని నిధులు కూడా మాయమైనట్టు తేలడంతో అకాడమీ అప్రమత్తమైంది. నిధులు గోల్‌మాల్ చేయడంలో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందని అనుమానించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సరైన పత్రాలు చూశాకే డిపాజిట్లు క్లోజ్‌ చేశామని బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు తెలిపారు.

ఏపీ వర్తక సహకార సంఘం ఏర్పాటు చేసినట్టు లేఖ సృష్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్లు రద్దు చేయాలని అధికారుల పేర్లతో బ్యాంకులకు లేఖ రాశారు. అయితే డిపాజిట్ల రద్దు వెనక ఎవరి హస్తం ఉందనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.