టీఆర్ఎస్‌కి ప్రజలంటే భయం లేదు.. ఎంఐఎం అంటే భయం

టీఆర్ఎస్‌ నాయకులకు ప్రజలంటే భయం లేదు కానీ, ఎంఐఎం అంటే మాత్రం భయం ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మొదటి దశ పూర్తయిన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటూ టీఆర్ఎస్‌ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చెతిలో ఉందని విమర్శించారు. 

టీఆర్ఎస్‌ అరాచకపాలనకు చరమగీతం పాడాలని ఆమె పిలుపిచ్చారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించాలంటే.. కమలంతో ప్రయాణించాలని ఆమె స్పష్టం చేశారు. 

నిధులు, నియామకాల లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణలో అవినీతి, నియంతృత్వ పాలన సాగుతున్నదని  స్మృతీ ఇరానీ ధ్వజమెత్తారు. హామీలన్నీ విస్మరించిన ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకే బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని ఆమె ప్రశంసించారు.

‘‘పంటల బీమా పథకంపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదు. హైకోర్టు మొట్టికాయలేసినా.. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. 20 నెలలైనా నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇవ్వలేదు’’ అని ఆమె మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి భారీగా నిధులు ఇస్తున్నదని ఆమె చెప్పారు.

దళితుల అభ్యున్నతికి రూ.25 వేల కోట్లను వెచ్చించడంతో పాటు స్టాండప్‌ ఇండియా పథకంలో దళితులను పారిశ్రామికవేత్తలను చేశామని కేంద్ర మంత్రి వివరించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని త్వరలో పునఃప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు.  ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయకుండా, పేదల ఆరోగ్యాన్ని కేసీఆర్‌ గాలికొదిలేశారని ఆమె ఆరోపించారు. తనకోసం ప్రగతిభవన్‌ కట్టుకున్న కేసీఆర్‌.. పేదలకు మాత్రం సొంత ఇళ్లు నిర్మించడం లేదని దుయ్యబట్టారు. 

నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్.. హామీ నిలబెట్టుకోలేదని ఆమె  మండిపడ్డారు. తెలంగాణ యువతకు స్టైఫండ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి 20 నెలలు అవుతున్నా.. ఇప్పటకీ రూ 3 వేల స్టైఫండ్ లభించలేదని ఆమె ధ్వజమెత్తారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదు? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి గౌరవార్ధం విమోచన దినం నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఎంఐ చేతుల్లో ఉంటే.. తెలంగాణ అభివృద్ధి పథంలో ఎలా పయనిస్తుంది? అని ఆమె ప్రశ్నించారు.

అందరికి ఉచిత విద్య, చికిత్స 

బీజేపీ అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, చికిత్స  అందిస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చేసే మొదటి సంతకం అదేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ సభ టీఆర్ఎస్ కు వీడ్కోలు సభ అని .. బీజేపీకి  మాత్రం స్వాగత సభ అని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 

సీఎం కావాలని తాను పాదయాత్ర చేయడం లేదని, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్రు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ బిజెపి సీఎం రావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. 

 ‘‘ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల కష్టాలు చూశాను. రోదిస్తూ.. వారు చెప్పుకొన్న బాధలు విన్నాను. రైతులు, నిరుద్యోగులు, భూ నిర్వాసితుల సమస్యలు నాకు కన్నీళ్లు తెప్పించాయి. పాదయాత్రలో నాతో జనం కలిసి నడిచారు. ఎండకు, వానకు నా వెంట ఉన్నారు. ఈ ఉత్సాహం చూస్తుంటే 2023లో అధికారం బీజేపీదే అని అర్థమవుతున్నది” అంటూ సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌ అంతానికి ఇదే చివరి పోరాటం కావాలని, ఇక బలిదానాలు వద్దని, టీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. 36 రోజులు 8 జిల్లాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగానని, ప్రజలు నీళ్ల బాధలు, నియామకాల కష్టాలు, అభివృద్ధి లేమి  కనిపించిందని సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం 2.91 లక్షల ఇళ్లు ఇచ్చిందని.. కానీ ఏ ఊరులోనూ ఇళ్లు రాలేదని చెబుతున్నారని తెలిపారు.

హుజూరాబాద్‌లో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, కేసీఆర్‌ రాజ్యాంగం అమలవుతున్నదని అక్కడ జరుగుతున్న ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి  ఈటల రాజేందర్  ఆరోపించారు. ‘‘ఐదు నెలలుగా ఇక్కడ మద్యం ఏరులై పారుతున్నది. మనుషులకు రేటు కట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారు” అంటూ ధ్వజమెత్తారు. 

 అక్టోబరు 30న హుజూరాబాద్‌లో జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవబోతున్నదిని భరోసా వ్యక్తం చేశారు. తనను బతికి ఉండగానే బొందపెట్టాలని చూస్తున్న కేసీఆర్‌ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. కుటుంబ పాలన కోసం తెలంగాణ సాధించుకున్నారని, జూటా మాటల్లో కేసీఆర్‌ను కేటీఆర్‌ మించిపోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు.