డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కొడుకు

ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. రేవ్ పార్టీ నిర్వాహకులతో పాటు పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు.  
వారిలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. గోవాలో తీగలాగితే ముంబైలో డ్రగ్స్ రాకెట్ డొంక కదలింది. సముద్రం మధ్యలో ఓ భారీ క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎన్సీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి అండర్ కవర్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో డ్రగ్స్ తీసుకుంటున్న దాదాపు 10 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

అయితే షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి కేసు న‌మోదు కాలేదు. అత‌న్ని అరెస్ట్ కూడా చేయ‌లేద‌ని ఎన్సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖెడె వెల్ల‌డించారు. ఈ క్రూజ్ పార్టీ ప్లాన్ చేసిన ఆరుగురు ఆర్గ‌నైజ‌ర్ల‌కు కూడా ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసింది. ఈ రేవ్ పార్టీలో ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ కాషిఫ్ ఖాన్ హ‌స్తం కూడా ఉండ‌టంతో ఆయ‌న‌ను కూడా ఎన్సీబీ ప్ర‌శ్నిస్తోంది.

ఇప్ప‌టికే ఆర్య‌న్ ఖాన్ ఫోన్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది. అత‌డు డ్ర‌గ్స్ తీసుకున్నాడా లేక అత‌ని ద‌గ్గ‌ర ఏవైనా డ్ర‌గ్స్ ఉన్నాయా అన్న కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు. రేవ్ పార్టీ త‌ర్వాత సీజ్ చేసిన ఫోన్ల‌కు వ‌చ్చిన మెసేజ్‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఆర్య‌న్ ఖాన్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కొడుకు. ఆర్య‌న్‌తోపాటు ఈ రేవ్ పార్టీలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ల కూతుళ్లు కూడా ఉన్న‌ట్లు ఎన్సీబీ గుర్తించింది.

క్రూజ్ షిప్‌పై దాడి చేసి అక్క‌డి నుంచి ఎక్స్‌ట‌సీ, కొకైన్‌, మెఫిడ్రోన్‌, చ‌ర‌స్‌లాంటి డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఎన్సీబీ వెల్ల‌డించింది. ఈ దాడుల సంద‌ర్భంగా 8 మందిని అదుపులోకి తీసుకుంది. అందులో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్నారు.

క‌చ్చిత‌మైన స‌మాచారంతోనే కార్డెలియా అనే ఈ క్రూజ్ షిప్‌పై దాడి చేసిన‌ట్లు ఎన్సీబీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ క్రూజ్ ముంబై నుంచి గోవా వెళ్తోంది. త‌మ క్రూజ్‌లో ప్ర‌యాణిస్తున్న వాళ్ల ద‌గ్గ‌ర నుంచి నార్కోటిక్స్ అధికారులు డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న‌ట్లు ఈ క్రూజ్ ప్రెసిడెంట్‌, సీఈవో జుర్గెన్ బైలోమ్ తెలిపారు.

శ‌నివారం రాత్రి బాలీవుడ్‌, ఫ్యాష‌న్‌, బిజినెస్ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ‌ల‌తో ఈ క్రూజ్ షిప్ మూడు రోజుల ప్ర‌యాణానికి బ‌య‌లు దేరింది. అయితే ఈ క్రూజ్ షిప్‌లో డ్ర‌గ్స్ ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న ఎన్సీబీ.. ప‌క్కా ప్రణాళిక‌తో దాడి చేసింది. ముంబై తీరం దాడి స‌ముద్రం మ‌ధ్య‌లోకి వెళ్ల‌గానే క్రూజ్‌లో రేవ్ పార్టీ ప్రారంభ‌మైంది.

ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడె ఓ ప్రయాణికుడిగా షిప్‌లో ఎక్కాడు. షిప్‌లోకి ఎక్కాలంటే ఎంట్రీ ఫీజు రూ. 80 వేల రూపాయలు. ముంబై తీరం నుంచి బయలుదేరిన షిప్.. సముద్రం మధ్యలోకి చేరుకోగానే రేవ్ పార్టీ మొదలైంది. అప్రమత్తమైన అధికారులు చాకచక్యంగా దాడులు నిర్వహించారు. 

దాదాపు ఏడు గంటల పాటు నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్ ముగిసిన తర్వాత క్రూయిజ్ షిప్‌ను ముంబై అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌కు తీసుకొచ్చారు. 

పట్టుబడిన వారందరినీ ఎన్‌సీబీ ఆఫీసుకు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వారందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేసే అవకాశాలున్నాయి. గత సంవత్సరం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ  కేసుకు సంబంధించి రియా చక్రవర్తి, దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్‌తో సహా పలువురు నటీనటులను ఎన్‌సీబీ విచారించింది.

ఇలా ఉండగా,  మహారాష్ట్ర  డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఎన్సీబీ బృందం దాడి చేసింది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నం చేసిన డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. ఎఫిడ్రిన్ తయారీ హైదరాబాద్ కేంద్రంగా నడిచినట్లు విచారణలో వెల్లడైంది. 

ముంబైలోని అంథేరిలో  ఐదు కోట్ల విలువైన ఎఫిడ్రిన్‌ను ఎన్సీబీ బృందం స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల తయారీ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. మాదకద్రవ్యాల ముడి సరుకును హైదరాబాద్‌కు దిగుమతి చేసుకొని ఎఫిడ్రిన్‌గా మార్చి అక్రమంగా దందా సాగుతోందని, విదేశాలకూ హైదరాబాద్ నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. రూ. 50,000 విలువ చేసే ఎఫిడ్రిన్ ఆస్ట్రేలియాలో రూ. 5 లక్షలు పలుకుతున్నట్లు సమాచారం. మొత్తం 10 మందిని ఎన్జీబీ అరెస్ట్ చేసింది. విచారణ కొనసాగుతోంది.