జగన్ ప్రభుత్వం నిధులివ్వక ముందుకెళ్లని రైల్వే ప్రాజెక్ట్ లు 

రూ.వేల కోట్ల వ్యయంతో కేంద్రం తలపెడుతున్న పలు రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో ముందుకు తీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఆర్థిక సహాయ, సహకారాలు అందించనిదే ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లడం కష్టమని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య స్పష్టం చేశారు.

సుమారు రెండేళ్ల తర్వాత విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్ల పరిధిలోని ఎంపీలతో జీఎం గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. ఎంపీలు మార్గాని భరత్‌, ఆదాల ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీత, చింతా అనూరాధ, బీవీ సత్యవతి, తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డప్ప, పి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌.సంజీవ్‌కుమార్‌, గోరంట్ల మాధవ్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ హాజరయ్యారు.

అత్యంత పురోగతిలో ఉన్న నడికుడి- శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, కోటిపల్లి-నర్సాపూర్‌ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని, ప్రభుత్వం నిధులిస్తే వీటిని అందుబాటులోకి తీసుకు రావచ్చని జీఎం తెలిపారు. 11 ఆర్‌వోబీ ప్రాజెక్టులకూ రాష్ట్ర ప్రభుత్వం కాస్ట్‌ షేరింగ్‌ ఇవ్వనందున అవి ఆగిపోయాయని పేర్కొన్నారు. 

విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని, కరోనాతో మరింత ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత భరిస్తామని, పనులు ఆపొద్దని వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఆర్‌వోబీ ప్రాజెక్టులకు కేంద్రమే నూరుశాతం భరించాలని కోరారు. 

పురోగతిలో ఉన్న పనుల నిలిపివేతపై కనకమేడల అభ్యంతరం తెలిపారు. కరోనా పేరు చెప్పి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవడాన్ని తప్పుబట్టారు. కరోనా సమయంలో కూడా ఆదాయం వచ్చిందని, 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు సహకరించకపోతే ఎలాగని ప్రశ్నించారు.
కాగా, రాజధాని అమరావతికి నూతన రైలు మార్గం ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, రైల్వే కూడా  పక్కన పెట్టింది. దీనిపై చర్చ జరగలేదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవటంపై ఎంపీలంతా స్పందించారు.