ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకనంకు హైకోర్టు బ్రేక్ 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ – 1 పోటీ పరీక్షలకు డిజిటల్ మూల్యాంకనంకు రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను సంప్రదాయ పద్ధతిలో మూల్యాంకనం చేయాలని (చేతితో దిద్దాలని), ఈ ప్రక్రియను నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీకి స్పష్టం చేసింది.

ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి సాధ్యమైనంత త్వరగా ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది. 2020లో రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ను చట్టబద్ధంగా సవరించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, దీనిద్వారా చైర్మన్‌ విధులు, అధికారాలను తొలగించలేరని స్పష్టం చేసింది.

ఏ కారణంతోనైనా కమిషన్‌కు చైర్మన్‌ సహకరించకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 316(1ఎ) ప్రకారం తాత్కాలిక చైర్మన్‌ను నియమించాలని గవర్నర్‌ను కోరవచ్చని గుర్తు చేసింది. గతేడాది విధానంలో మార్పులు జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులందరికీ సమాచారం ఇవ్వాలని, కానీ ఏపీపీఎస్సీ అలా చేయలేదని అభ్యంతరం తెలిపింది.

ఎంతోమంది ఔత్సాహికుల జీవితాలు ఇమిడి ఉన్నందున ప్రధాన పరీక్ష పేపర్లను సంప్రదాయ విధానంలో మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. యువ ఆశావహులైన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వ్యవహారంలో భాగస్వాములైనవారు, అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని తెలిపింది.

ప్రభుత్వ అధికారులు, ఏపీపీఎస్సీ తమ అధికారాలను ప్రజా శ్రేయస్సు కోసమే ఉపయోగిస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల విషయంలో ఏపీపీఎస్సీ డిజిటల్‌/ అధునాతన విధానాలు అవలంబించేందుకు ప్రస్తుత ఉత్తర్వులు అవరోధం కాబోవని స్పష్టం చేసింది. 

అయితే కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాలనే నిర్ణయాలు పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని తేల్చిచెప్పింది. రిట్‌ పిటిషన్లను పాక్షికంగా అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు తీర్పు ఇచ్చారు.