జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టక పోవడంపై హైకోర్టు అక్షింతలు

రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసే జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టక పోవడంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి  హైకోర్టు అక్షింతలు వేసింది. జీవోల అప్‌లోడ్‌కు సంబంధించి సాఫీగా జరుగుతున్న ప్రక్రియను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించింది. సీక్రెట్‌, టాప్‌ సీక్రెట్‌ జీవోలు తప్ప మిగిలిన జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచితే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని వ్యాఖ్యానించింది. 

ప్రజాధనంతో ముడిపడి ఉన్న జీవోలను 24 గంటల్లో అప్‌లోడ్‌ చేసేలా ప్రభుత్వానికి సూచించాలని మౌఖిక ఆదేశాలిచ్చింది. పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. 

ప్రభుత్వ జీవోలను జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో పెట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ గుంటూరుకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, జీఎంఎన్‌ఎస్‌ దేవి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.  పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శ్రీకాంత్‌, కారుమంచి ఇంద్రనీల్‌ బాబు, వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ ఏపీజీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో జీవోలను ప్రజలు సులువుగా తీసుకునేవారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిని క్లిష్టతరం చేసిందని తెలిపారు.

జీవోలను ఏపీగెజిట్‌ వెబ్‌సైట్‌లో ఉంచాలని సెప్టెంబరు 7న జీవో 100ని జారీ చేసింది. జీవోలను అత్యంత రహస్యం, రహస్యం, గోప్యం అంటూ మూడు కేటగిరీలుగా విభజించింది. అలాంటి జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టబోమని ఉత్తర్వుల్లో పేర్కొందిని వారు తెలిపారు. వారానికోసారి జీవోలను ఏపీగెజిట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారని చెప్పారు. 

 గోప్యత పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచడం లేదు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ రోజువారీ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ నిర్ణయం సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. జీవోఐఆర్‌తో పోల్చితే ప్రస్తుతం ఏపీగెజిట్‌లో కేవలం 12.3 శాతం జీవోలే అప్‌లోడ్‌ చేస్తున్నారని వారు  కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

సంతకాలు లేని జీవోలను గతంలో ఏపీజీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేవారని.. తదనందరం ఏపీగెజిట్‌లో ఉంచేవారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎ్‌సజీపీ) సి.సుమన్‌ తెలిపారు. గతంలో మాదిరిగానే జీవోలన్నిటినీ ఏపీగెజిట్‌లో ఉంచుతున్నామని,  సచివాలయం ఆఫీస్‌ మాన్యువల్‌, ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ని అనుసరించి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

కాన్ఫిడెన్షియల్‌ జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచకూడదనేది తాజాగా తీసుకున్న నిర్ణయం కాదని.. గతం నుంచీ కొనసాగుతోందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. కాన్ఫిడెన్షియల్‌ జీవోలంటే ఏంటని ప్రశ్నించింది. ఎస్‌జీపీ కొన్నిటిని ప్రస్తావించగా.. రొటీన్‌ జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సరికాదని కోర్టు పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.