చైనా సరిహద్దులో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి 

మనకు చైనాతో నెలకొన్న సరిహద్దు సమస్యపై ఉభయ దేశాల మధ్య శాశ్వత ఒప్పందం కుదిరేవరకు సరిహద్దులో ఘర్షణలు తరచుగా జరుగుతూనే ఉంటాయని భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే స్పష్టం చేశారు. అయితే ఆ దేశం ఏదైనా దుస్సాహసంతో కూడిన సంఘటనకు దిగితే  గతంలో మాదిరిగానే ఎదుర్కొనడానికి మన సేనలు  సర్వసన్నద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.

పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ సరిహద్దు ఒప్పందం కుదరాలని, దీర్ఘకాలిక పరిష్కారం వచ్చే వరకు ఇటువంటి సంఘటనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉత్తర సరిహద్దుల్లో శాశ్వత ప్రశాంతత ఏర్పడే విధంగా మనం కృషి చేయాలని పేర్కొన్నారు. 

ఆఫ్ఘానిస్తాన్ లోని తాజా పరిణామాలను ప్రస్తావిస్తూ భారత సైన్యం వాటిని పరిగణలోకి తీసుకొంటూనే ఉంటుందని చెప్పారు. ఎప్పటికప్పుడు మనకు ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్ళను విశ్లేషిస్తూ, అందుకు అవసరమైన తగు చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఏ దేశపు సైన్యమైన భద్రతపర సవాళ్ళను తరచూ విశ్లేషిస్తూ, తమ వ్యూహాలను మార్చుకొంటూ ఉంటుందని పేర్కొన్నారు. 

 మన దేశానికి తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో కొనసాగుతున్న సవాళ్ళకు తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి జరుగుతున్న పరిణామాలు జత కలిశాయని చెబుతూ దీర్ఘకాలిక పరిష్కారం కుదిరే వరకు ఇటువంటి సంఘటనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 

పాకిస్థాన్ సరిహద్దులో నెలకొన్న ఉగ్రవాద ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ ఎటువంటి పరిస్థితులైన కట్టడి చేయడానికి మన సైన్యం సిద్ధంగా ఉన్నట్లు నరవాణే వెల్లడించారు. అక్కడ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో మన సైన్యం క్రియాశీలంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. 

తూర్పు లడఖ్‌లో గత మే నెలలో చైనాతో ప్రారంభమైన ప్రతిష్టంభనను ప్రస్తావిస్తూ, మునుపెన్నడూ ఎరుగని పరిణామాలు సంభవించడంతో పెద్ద ఎత్తున వనరులను అక్కడికి పంపించవలసి వచ్చిందని గుర్తు చేశారు. దళాల మధ్య సమన్వయం ఏర్పరచవలసి వచ్చిందని, తక్షణమే స్పందించవలసి వచ్చిందని, ఇవన్నీ కోవిడ్-19 మహమ్మారి సమయంలో చేయవలసి వచ్చిందని వివరించారు.

కాగా, సుదీర్ఘ సేకరణ ప్రక్రియలు, అధికారగణం స్పీడ్ బ్రేకర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సేకరించకుండా మనల్ని నిరోధిస్తున్నాయని, ఈ అపాయం వాస్తవమని వ్యాఖ్యానించారు. వ్యాపారం చేయడం సులువుగా మార్చాలనే లక్ష్యంతో వ్యవస్థీకృత మార్పులు తేవడం కోసం చాలా కృషి జరిగిందని చెప్పారు. 

అయితే ఇది కొనసాగుతున్న కృషిగా మిగిలిపోతోందని చెప్పారు. తర్కాన్ని ధిక్కరించే, ఆధునిక ఉత్తమ ఆచరణలకు భిన్నమైన పాత కాలపు నిబంధనలు, ప్రక్రియలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇటీవల అత్యవసర అధికారాలను రక్షణ దళాలకు ఇవ్వడం వల్ల చాలా సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు.

అత్యవసరంగా ఆయుధాలు, ఇతర పరికరాలను సేకరించేందుకు డిఫెన్స్ సర్వీసెస్‌కు ఆర్థికాధికారాలను కల్పించడం వల్ల సత్ఫలితాలు వచ్చినట్లు చెప్పారు. ఈ అధికారాలను మొదట గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు కల్పించారని, ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టు వరకు పొడిగించారని చెప్పారు.