చీరలో వచ్చిన మహిళను అనుమతించని రెస్టారెంట్ మూసివేత

చీరలో వచ్చిన మహిళను అనుమతించని ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్ పలు కారణాలతో మూత పడింది. వ్యాపార లైసెన్స్‌ లేకుండా రెస్టారెంట్‌ను నిర్వహించడంపై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) నోటీసులు జారీ చేసింది. ‘పబ్లిక్ హెల్త్ ఇన్స్‌పెక్టర్ సెప్టెంబర్ 24న సైట్‌ను మళ్లీ తనిఖీ చేశారు. లైసెన్స్‌ లేకుండానే రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 

ఈ నేపథ్యంలో ఈ నోటీసు అందిన 48 గంటల్లోపు వ్యాపారాన్ని నిలిపివేయాలని నిర్దేశించడమైనది. లేనిపక్షంలో ఎలాంటి నోటీసు జారీ చేయకుండా రెస్టారెంట్‌ సీలింగ్‌తో సహా అన్ని చర్యలు తీసుకుంటాం’ అని ఎస్‌డీఎంసీ హెచ్చరించింది. దీంతో యజమాని రెస్టారెంట్‌ను మూసివేశారు. వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశారు.

కాగా, ఆండ్రూస్ గంజ్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ మున్సిపల్‌ సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తారు. ఆ రెస్టారెంట్‌పై రూ.5 లక్షల జరిమానా విధించాలని డిమాండ్ చేస్తూ సంబంధిత ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రెస్టారెంట్‌కు జరిమానా విధించడం వంటి చర్యలు చేపడతామని ఎస్‌డీఎంసీ మేయర్ ముఖేష్ సూర్యన్ తెలిపారు.

మహిళలు చీరలు ధరించడం భారతీయ సంప్రదాయం. అయితే చీరలో వచ్చిన ఒక మహిళను రెస్టారెంట్‌ సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఆమె వస్త్రధారణ స్మార్ట్‌ క్యాజువల్‌ డ్రెస్ ‌కోడ్‌ కిందకు రాదంటూ రెస్టారెంట్‌లోకి రాకుండా ఆమెను అడ్డుకోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.చీర ధరిస్తే రెస్టారెంట్‌లోనికి అనుమతించకూడదన్న డ్రెస్‌ కోడ్‌ గురించి తనకు చూపించాలని ఆ మహిళ అక్కడి సిబ్బందిని నిలదీశారు.

‘మేము స్మార్ట్ క్యాజువల్‌ని మాత్రమే అనుమతిస్తాము. చీర స్మార్ట్ క్యాజువల్ కిందకు రాదు’ అంటూ ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా  సమాధానమిచ్చాడు. దేశ రాజధాని ఢిల్లీ ఆగస్ట్‌క్రాంతి మార్గంలోని అన్సల్ ప్లాజాలో ఉన్న అక్విలా బార్‌ అండ్ ‌రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనపై జర్నలిస్ట్‌ అనితా చౌదరి ఆశ్చర్యపోయారు. దీనిపై ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

 ‘చీర ధరించే మహిళలను అక్విలా రెస్టారెంట్‌లోకి అనుమతించరు. ఎందుకంటే భారతీయ చీర ఇప్పుడు స్మార్ట్ డ్రెస్‌ కాదు. అసలు స్మార్ట్ డ్రెస్‌కు కాంక్రీట్ నిర్వచనం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి. దయచేసి స్మార్ట్ దుస్తుల గురించి నిర్వచించండి. అప్పుడు నేను చీర కట్టుకోవడం మానేస్తాను’ అని ఆమె అందులో పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ మహిళా కమిషన్‌తోపాటు పలువురికి దీనిని ట్యాగ్ చేశారు.

మరోవైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆ రెస్టారెంట్‌ డ్రెస్ కోడ్ విధానంపై మండిపట్టారు. ఇది వివక్షతతో కూడిన దారుణ నిబంధన అని ఆరోపించారు. ‘చీర స్మార్ట్‌ డ్రెస్‌ కాదని ఎవరు నిర్ణయించారు?’ అని కొందరు ప్రశ్నించారు.

అమెరికా, బ్రిటన్‌, యూఏఈలోని ఉత్తమ రెస్టారెంట్లలో కూడా భారతీయ మహిళలు, విదేశీ మహిళలు చీరలు ధరించిన సంగతిని గుర్తు చేశారు. అక్విలా రెస్టారెంట్ వంటివి భారత్‌లో డ్రెస్ కోడ్‌ను నిర్దేశిస్తాయా అని మండిపట్టారు. ఈ రెస్టారెంట్ ‌విధించిన ఈ నిబంధనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్విలా రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ‌చేశారు.

అయితే దీనిపై అక్విలా రెస్టారెంట్‌ మరునాడు స్పందించింది. ఆ మహిళ తమ సిబ్బందిని కొట్టినట్లు ఆరోపించింది. ఈ మేరకు చిన్న వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఆమెను అక్కడి నుంచి పంపించే ఉద్దేశంతోనే తమ సిబ్బంది అలా చెప్పారని తెలిపింది. చీర ధరించిన మహిళలను లోనికి అనుమతించబోమన్న తమ సిబ్బంది వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడంతోపాటు భవిష్యత్తులో ఇలా జరుగకుండా చూస్తామని వివరణ ఇచ్చింది.