బ్యాంకు ప‌రీక్ష‌లన్నీ ప్రాంతీయ భాష‌ల్లోనే !

ఇక ప్ర‌భుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో ఉద్యోగ నియామ‌క ప‌రీక్ష‌లు ప్రాంతీయ భాష‌ల్లోనూ జ‌రుగ‌నున్నాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెలెక్ష‌న్ (ఐబీపీఎస్‌) ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు బ్యాంకు ఉద్యోగాల‌కు ఇంగ్లిష్, హిందీ భాష‌ల్లో మాత్ర‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. 

కేంద్ర ఆర్థిక శాఖ నియ‌మించిన క‌మిటీ సిఫార‌సు మేర‌కు ప్రాంతీయ భాష‌ల్లో ప్ర‌భుత్వ బ్యాంకుల సిబ్బంది నియామ‌క ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. స్థానిక భాష‌ల్లో ప‌రీక్ష‌లు రాసి ఉద్యోగం సంపాదిస్తే, స్థానికుల‌కు మెరుగైన సేవ‌లందించ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐబీపీఎస్ వెల్ల‌డించింది. 

దీని ప్ర‌కారం 12 ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) సిబ్బంది నియామ‌కం కోసం జ‌రిగే ప్రిలిమిన‌రీ, మెయిన్ ప‌రీక్ష‌లు 13 ప్రాంతీయ భాష‌ల్లో జరుగుతాయి. స్థానిక యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐబీపీఎస్ తెలిపింది.

ఇప్ప‌టికే ఎస్బీఐలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ఐబీపీఎస్ ప్ర‌క‌ట‌న చేసింది. దాని ప్ర‌కారం ఇంగ్లిష్‌, హిందీల్లో మాత్ర‌మే ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. భ‌విష్య‌త్‌లో నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించింది. 

ప్రాంతీయ భాష‌ల్లో బ్యాంకు ఉద్యోగ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని వివిధ రాష్ట్రాలు, ప్ర‌త్యేకించి ద‌క్షిణ భార‌త రాష్ట్రాలు డిమాండ్ చేసిన నేప‌థ్యంలో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.