పంజాబ్ కాంగ్రెస్ లో చీలిక … చత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ లో ముసలం

ఒక వంక పంజాబ్ కాంగ్రెస్ లో చెలరేగిన సంక్షోభం సర్దుబాటు అయ్యే పరిస్థితులు కనిపించక  పోగా,మరోవంక తాజాగా చత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌లో మరో ముసలం మొదలైంది. పంజాబ్‌లో వివాదం ఓ కొలిక్కి రాకమునుపే.. మరో అధికారిక రాష్ట్రం చత్తీస్‌గఢ్‌లో తలనొప్పి ప్రారంభమైంది. 

తాను బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న కథనాలను కొట్టిపారవేస్తూ,  పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితులు లేవని స్పష్టం చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ లో చీలిక అనివార్యంగా కనిపిస్తున్నది.  ఆయన పంజాబ్‌లో కొత్త పార్టీ ఏర్పాటుపై పరోక్షంగా సంకేతం ఇచ్చారు.పార్టీ మెజారిటీని కోల్పోతే అసెంబ్లీ స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ద్వారా కాంగ్రెస్ నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు.  

గతంలో  చత్తీస్‌గఢ్‌ లో  అధికార మార్పు కోరుతూ  కాంగ్రెస్‌ నేతలు పోటాపోటీగా ఢిల్లీకి చేరడం తెలిసిందే. అధిష్టానం నచ్చజెప్పి పంపినప్పటికీ మరోసారి అసమ్మతి రాజుకుంది. పంజాబ్ తరువాత ఇప్పుడు చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత ముసలం ముదిరింది. రాష్ట్రానికి చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నుంచి దేశ రాజధానిలో మకాం వేసి ఉన్నారు. 

రాహుల్ గాంధీని కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి భూపేష్ బగేల్‌కు విధేయులు అయిన ఎమ్మెల్యేలు బృందంగా ఢిల్లీకి వచ్చినట్లు తెలిసింది.  ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ స్థానంలో సింగ్‌దేవ్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ ఆగస్టు నెలలో ఇరు వర్గాలు అధిష్టానంతో చర్చించాయి.

రొటేషన్ పద్ధతిలో సిఎంల మార్పిడి ఒప్పందం అమలుకై రాహుల్  బస్తర్ పర్యటన ఖరారు అయింది. ఇప్పటికిప్పుడు పర్యటనకు రావద్దని, సిఎంగా బగేల్ కొనసాగేలా చూడాల్సి ఉందని రాహుల్‌కు తెలియచేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీలో మకాం వేసి ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత కుదిరిన ఒప్పందంలో భాగంగా తరువాతి సిఎం స్థానం కాంగ్రెస్ మరో నేత టిఎస్ సింగ్ దేవ్‌కు దక్కాల్సి ఉంది.

ఇచ్చిన మాట ప్రకారం తనకు పదవి దక్కాలని సింగ్‌దేవ్ మరోవంక వత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రతరం అయింది. ఇది ఎంతదూరం వెళ్లుతుందో తెలియని స్థితి నెలకొనడంతో కాంగ్రెస్ వర్గాలు కంగుతింటున్నాయి.

మరోవంక,  క్షీణదశలో ఉన్న కాంగ్రెస్‌లో కొనసాగే ఉద్దేశం లేదని, అలాగని బీజేపీలో చేరే ఆలోచనా లేదని అమరిందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. తనను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించిందని, తాను నమ్మిన ఆదర్శాలు ఆ పార్టీలో ఉండేందుకు అనుమతించవని చెప్పారు. పంజాబ్‌ ప్రయోజనాలే తనకు ముఖ్యమని పేరొక్నటు ఆ కోణంలో తనకున్న మార్గాలపై ఆలోచిస్తున్నానని తెలిపారు. పంజాబ్‌లో సరైన పరిపాలన లేకపోవడం పాకిస్థాన్‌కు అవకాశం ఇస్తుందని, అది రాష్ట్రానికి, దేశానికి సమస్యలు సృష్టిస్తుందని హెచ్చరించారు.

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్ని మధ్య జరిగిన సమావేశం కాంగ్రెస్ అధిష్ఠానంకు కొంత ఉపశమనం కలిగిస్తున్నది.  చండీగఢ్‌లోని పంజాబ్ భవన్‌లో ఇద్దరి మధ్య జరిగిన ‘చర్చలు’ సఫలమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ‘సమస్యలు మొత్తం’ పరిష్కారమైనట్టు వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాగా, పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంపై పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారాన్ని అణగదొక్కేందుకు పదేపదే చేస్తున్న ప్రయత్నాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ అధిష్ఠానంకు విజ్ఞప్తి చేశారు. ఏజీ, డీజీపీ వంటి ఉన్నతాధికారుల ఎంపిక విషయంలో ఆరోపణలు సరికాదని సిద్ధూను ఉద్దేశించి మండిపడ్డారు.