కుత్రిమ మేధతో ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు 

కృత్రిమమేధ, ఏఐఓటీ కారణంగా గత దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు. రాజస్థాన్‌ జోధ్‌పూర్ ఐఐటీలోని జోధ్‌పూర్ సిటీ నాలెడ్జ్ అండ్ ఇన్నొవేషన్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా ఫ్యాబ్రికేషన్ లాబొరేటరీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్ (ఏఐఓటీ) కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

కృత్రిమ మేధ వంటి విప్లవాత్మక సాంకేతిక సంస్కరణల సామర్థ్యం ద్వారా కలిగే లాభాలను ప్రజలకు అందించి వారి జీవితాల నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ దిశగా విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రజాకేంద్రిత కృత్రిమమేధ వినియోగాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, శాస్త్రవేత్తలు ముందుకు రావాలని సూచించారు.

కృత్రిమమేధ, ఏఐఓటీ కారణంగా గత దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.  ప్రజలు దోపిడీకి గురికాకుండా సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు చొరవతీసుకోవాలని చెప్పారు.

యువత సేవాభావాన్ని అలవర్చుకోవాలని, రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు. యువశక్తికి సిద్ధాంతం, కాలుష్యం కాని ఆలోచనలు తోడైతే భారత రాజకీయాల్లో గణనీయమైన మార్పులు సాధ్యమని, ఈ దిశగా యువత ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ రాష్ట్ర మంత్రి బీడీ కల్లా కూడా పాల్గొన్నారు.

మరో కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా రాసిన ‘సంవిధాన్, సంస్కృతి, ఔర్ రాష్ట్ర్‌’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. చిన్నారుల్లో బాల్యం నుంచే జాతీయవాద భావన పెంపొందించాలని సూచించారు. గవర్నర్ హోదాలో రాజస్థాన్‌లో కల్రాజ్ మిశ్రా చేస్తున్న సేవలను అభినందించారు.