జావేద్ అఖ్తర్‌కు థాణె కోర్టు షోకాజ్ నోటీసు

టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను తాలిబన్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్ చేసిన ఫిర్యాదుపై కవి, సినీ గీత రచయిత జావేద్ అఖ్తర్‌కు మహారాష్ట్రలోని థాణె కోర్టు మంగళవారం షోకాజ్ నోటీసు జారీచేసిది. 
 
ఆర్‌ఎస్‌ఎస్‌ను అపఖ్యాతి పాల్జేసి, అందులో చేరిన వారిని నిరుత్సాహపరచడం, తప్పుదోవ పట్టించాలన్న దురుద్దేశంతోనే జావేద్ అఖ్తర్ తమ సంస్థపై అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారని ఆర్‌ఎస్‌ఎస్ తన ఫిర్యాదులో ఆరోపించింది. 
 
నవంబర్ 12వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ థాణెలోని చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జావేద్ అఖ్తర్‌కు షోకాజ్ నోటీసు జారీచేసింది. తాలిబన్ల లక్ష్యం, ఆర్‌ఎస్‌ఎస్ లక్షం ఒకటేనంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా అయిన అఖ్తర్ ఆరోపించినట్లు తన ఫిర్యాదులో ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొంది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, పలువురు క్యాబినెట్ మంత్రులతోసహా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పలువురు కీలక నేతలు ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు, మద్దతుదారులని తన ఫిర్యాదులో ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొంది. తాలిబన్ల మాదిరిగా వ్యవహరించినట్లు తమ సభ్యులలో ఒక్కరిపైన కూడా ఆధారాలు చూపకుండా అఖ్తర్ వ్యాఖ్యలు చేశారని ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొంది.
అక్త‌ర్ ఆరెస్సెస్ ప్ర‌తిష్ట దిగ‌జార్చేలా వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న రూ కోటి ప‌రిహారం చెల్లించాల‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది ఆదిత్య మిశ్రా వాదించారు. హిందువుల కోసం ప‌నిచేస్తున్న సంస్ధ‌ను అరాచ‌క తాలిబ‌న్ల‌తో పోల్చ‌డం ప్ర‌జ‌ల్లో ఆరెస్సెస్ ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చే ఉద్దేశంతోనే అక్త‌ర్ మాట్లాడార‌ని ఆరోపించారు. జావేద్ అఖ్తర్ భవిష్యత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌పైన ఇటువంటి ఆరపణలు చేయకుండా ఆయనను శాశ్వతంగా కట్టడి చేయాలంటూ కోర్టును అర్థించారు.