చ‌న్నీ ప్రభుత్వంకు విశ్వాస తీర్మానం గండం!

పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం క్రమంగా అక్కడి  చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ ప్రభుత్వం మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నది. ఒక వంక ఎంతో కష్టపడి కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రభుత్వాన్ని గద్దె దింపగలిగిన నవజ్యోత్ సింగ్ సిద్దుకు కొత్త ప్రభుత్వంలో తీవ్ర ఆశాభంగం కలగడంతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఇదే సమయంలో చన్నీ ప్రభుత్వం విశ్వాస తీర్మానం ఎదుర్కోవాలని సొంతపార్టీ ఎమ్యెల్యేల  నుండే డిమాండ్ బయలుదేరడం కలకలం సృష్టిస్తున్నది. వీరంతా మాజీ సీఎం కెప్టెన్ అమ‌రింద‌ర్ సింగ్‌కు మ‌ద్ద‌తుదారులు అని చెబుతున్నారు.మరోవంక, సీఎం చ‌ర‌ణ్‌సింగ్ చ‌న్నీ త‌న‌ను విశ్వాసం తీసుకోలేద‌నే అసంతృప్తితోనే న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీ పదవికి రాజీనామా చేసిన్నట్లు తెలుస్తున్నది.  సిద్ధూకు సంఘీభావంగా  మంత్రి రజియా సుల్తానా, ఒక ఎమ్మెల్యే మ‌రికొంద‌రు నేత‌లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.

చన్నీ ప్రభుత్వంలో తన స్వస్థలం అమృతసర్ లో తన వ్యతిరేక నేతలకు కీలక పదవులు లభించడం తట్టుకోలేక పోతున్నారు. కెప్టెన్ అమరిందర్ ప్రభుత్వంలో సహితం వారికి తగు గుర్తింపు లభించలేదు. 2009 లోక్ సభ ఎన్నికలలో తనను దాదాపుగా ఓటమి అంచుకు తీసుకెళ్లిన అమృతసర్ సెంట్రల్ ఎమ్యెల్యే ఓం ప్రకాష్ సోనిని ఉప ముఖ్యమంత్రి చేయడం సహించలేక పోతున్నారు.

ఎందుకంటె వీరిద్దరి మధ్య ఇంకా కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. పైగా, సీఎంగా రాజీనామా చేసేంతవరకు సోని అమరిందర్ శిబిరంలో ఉన్నారు. బహిరంగంగా తనను వ్యతిరేరేకిస్తుందే అమృతసర్ వెస్ట్ ఎమ్యెల్యే రాజ్కుమార్ వేర్క ను దళిత్ కోటాలో మంత్రిగా చేశారు. దళిత్ సీఎం ఉండగా, మరొకరిని మంత్రిగా తీసుకోవడం అమృతసర్ లో తనను బలహీనం చేయడానికే అని సిద్దు అనుమానిస్తున్నారు.

అమరిందర్ సింగ్ ను ముఖ్యమంత్రిగా దింపగలిగినా రాజకీయంగా తాను ప్రయోజనం పొందలేకపోయానని, పైగా ఆ పోరాటంలో అమరిందర్ కు వ్యతిరేకంగా తనతోపాటున్న ఎమ్యెల్యేలు అంత ఇప్పుడు ఎవ్వరి దారి వారు చూసుకొంటున్నారని తెలిసి సిద్దూ ఒంటరిగా భావిస్తున్నారు.  గత వారం ముఖ్యమంత్రి అమృతసర్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన భుజంపై చేయి వేస్తూ తానే `సూపర్ సీఎం’ అనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే డిజిపి వంటి కీలక అధికారుల నియామకంలో, మంత్రుల నియామకంలో సీఎం తన మాటలను ఏమీ లెక్కచేయడం లేదు.

చండీఘర్ లో తరచూ ఆర్ధిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ ఇంటికి విందులకు వెడుతూ, అక్కడ రాజకీయ సమాలోచనలు చేస్తున్నారు. తనను ఏ విషయంలో కూడా సంప్రదించడం లేదు. ఒక వైపు సిద్దూ మద్దతు దారుల నుండి, మరోవైపు అమరిందర్ సింగ్ మద్దతు దారుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న చున్నీ ప్రభుత్వం విశ్వాస తీర్మానం ఎదుర్కోవలసి వస్తే బాటపడటం కష్టమే అని పరిశీలకులు భావిస్తున్నారు.

తాజా ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్లు అమ‌రింద‌ర్ సింగ్ చెప్పారు. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి పెద్ద నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట మ‌రో పార్టీలో చేర‌డానికి వీలుగా కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధూ రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని ఆరోపించారు.

|పంజాబ్‌లో పాల‌న కుక్క‌ల‌ పాలైంద‌ని బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌రుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. గ‌త రెండున్నర నెల‌లుగా వివిధ శాఖ‌ల మంత్రులు త‌మ కార్యాల‌యాల‌కు హాజ‌రు కావ‌డం లేద‌ని పేర్కొన్నారు. మాఫియాకు పాల‌న అప్ప‌గించి పాపాలు మూట‌గ‌ట్టుకున్న కాంగ్రెస్ పార్టీని వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ట్టి క‌రిపించాల‌ని త‌రుణ్ చుగ్ పంజాబ్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

సిద్దూ ఒక మాన‌వ బాంబు అని  శిరోమ‌ణి అకాలీద‌ళ్ (ఎస్ఏడీ) అధికార ప్ర‌తినిధి మంజింద‌ర్ సింగ్ ఆరోపించారు. సిద్దూ అస్థిర‌మైన వ్య‌క్తి అని, ఆయ‌న ఎక్క‌డికెళ్లినా స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌ని పేర్కొన్నారు.